వరుసగా రెండోరోజు నష్టాల్లో సూచీలు..

by Harish |   ( Updated:2021-06-29 05:35:05.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లో నష్టాలను ఎదుర్కొన్నాయి. రోజంతా ఆటుపోట్ల మధ్య ర్యాలీ చేసిన సూచీలు చివర్లో నష్టాలను నమోదు చేశాయి. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొవిడ్ మహమ్మరి వల్ల దెబ్బతిన్న రంగాల కోసం రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లు పతనమయ్యాయి. తాజా ఉద్దీపన ప్రకటన ఆర్థిక వృద్ధికి పెద్దగా తోడ్పడకపోవచ్చని పలువురు ఆర్థికవేత్తలు, పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీనికితోడు ఆసియా మార్కెట్లు నీరసించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో కీలక రంగలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 185.93 పాయింట్లు కోల్పోయి 52,549 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.25 పాయింట్ల నష్టంతో 15,748 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అధికంగా 1.5 శాతం పతనమవగా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంకింగ్, ఫైనన్స్, మీడియా, రియల్టీ రంగాలు డీలాపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, డా రెడ్డీస్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.25 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed