మళ్లీ లాభాల బాటలో…

by Harish |
మళ్లీ లాభాల బాటలో…
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుస పది రోజుల ర్యాలీ తర్వాత గురువారం నాటి భారీ నష్టాలను అధిగమించిన సూచీలు వారాంతానికి కోలుకున్నాయి. వారాంతం సందర్భంగా మదుపర్లు కొనుగోళ్లకు మద్దతివ్వడంతో మార్కెట్లు రాణించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మెటల్, బ్యాంక్, ఫార్మా రంగాల షేర్లు పుంజుకోవడంతో సూచీలకు కలిసొచ్చాయని నిపుణులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 254.57 పాయింట్లు ఎగసి 39,982 వద్ద ముగియగా, నిఫ్టీ 82.10 పాయింట్లు లాభపడి 11,762 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా 11 రంగాల్లో 9 రంగాలు 4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ రంగాలు 1.5 నుంచి 2 శాతం మధ్య బలపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా టాటా స్టీల్ షేర్లు 5 శాతానికి పైగా బలపడగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.36 వద్ద ఉంది.

Advertisement

Next Story