50 వేలకు చేరువలో సెన్సెక్స్!

by Shamantha N |
50 వేలకు చేరువలో సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి జోరు పెంచాయి. మంగళవారం నాటి స్పీడ్‌కు కొనసాగిస్తూ స్టాక్ మార్కెట్లు 50 వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల అండతో కొనుగోళ్లకు సిద్ధపడిన ఇన్వెస్టర్లు సూచీల జోరుకు మద్దతిచ్చారు. దీంతో గత కొంతకాలంగా నమోదవుతున్న జీవితకాల గరిష్ఠాలను మరోసారి బుధవారం కూడా నమోదు చేశాయి సెన్సెక్స్ ఇండెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా ఆల్‌టైం రికార్డు స్థాయిలను సాధించింది. ఉదయం ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు ఆ తర్వాత అదే జోష్‌తో కొనసాగాయి. అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీ ఆవిష్కరణ ఉంటుందన్న ప్రకటనతో ఆసియా మార్కెట్లౌ జోరందుకున్నాయి.

వీటితో పాటు దేశీయంగా కీలకకంపెనీల షేర్లు ర్యాలీ చేయడంతో చివరి వరకు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. చివరి గంటలో కొంతవరకు లాభాల స్వీకరణ కారణంగా 50 వేల మార్కుకు అతి చేరువగా సూచీలు కదలాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 393.83 పాయింట్లు ఎగసి 49,792 వద్ద ముగియగా, నిఫ్టీ 123.55 పాయింట్లు లాభపడి 14,644 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహాయించి అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ రంగాలు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో కదలాడగా, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.02 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed