మార్కెట్ల భారీ పతనం

by Shyam |
మార్కెట్ల భారీ పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) భారీ నష్టాలను చూశాయి. దేశీయ మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా సూచీలు ప్రారంభం నుంచే అదే స్థాయిలో పతనమవుతూ వచ్చాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ క్షీణిస్తున్నదనే సంకేతాల కారణంగా బుధవారం అర్ధరాత్రి అమెరికా మార్కెట్లు సైతం భారీగా నష్టపోయాయి. అమెరికా ప్రభుత్వ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు అడుగంటిపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణంగా అమెరికా మార్కెట్లలో సెంటిమెంట్ దిగజారింది.

దీంతో గురువారం ప్రపంచ మార్కెట్లు అధిక ఒత్తిడికి లోనయ్యాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1114.82 పాయింట్ల భారీ నష్టంతో 36,553 వద్ద ముగియగా, నిఫ్టీ 326.30 పాయింట్లు నష్టపోయి 10,805 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు డీలాపడ్డాయి. మీడియా, ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, ఆటో రంగాలు అత్యధికంగా 4 శాతం వరకు క్షీణించడం గమనిస్తే అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్ మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, టీసీఎస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.89 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed