కొండంత నష్టం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2021-12-21 06:10:31.0  )
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు సెషన్లలో దేశీయ ఈక్విటీ మార్కెట్లను గట్టిగా కుదిపేసిన బేర్ మంగళవారం పట్టు సడలించింది. ఒమిక్రాన్ వేరియంట్ అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా వేగంగా వ్యాపిస్తుండటంతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. దీనివల్లే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక కంపెనీల షేర్లకు పెరిగిన కొనుగోలు కారణంగా సూచీలు నష్టాలను పూడ్చుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల్లో కంపెనీల షేర్లు మార్కెట్లకు కీలక మద్దతునిచ్చాయి. ఉదయం ప్రారంభం నుంచే దూకుడు పెంచిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ సమయానికి నిన్నటి నష్టాలను అధిగమిస్తూ వెయ్యి పాయింట్ల వరకు పుంజుకున్నాయి.

అయితే ఆ తర్వాత పరిణామాల్లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం తో లాభాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు పెరిగి 56,319 వద్ద, నిఫ్టీ 156.65 పాయింట్లు ఎగసి 16,770 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ర్యాలీ చేయగా, మిగిలిన రంగాలు సానుకూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఆల్ట్రా సిమెంట్, టైటాన్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను సాధించగా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.58 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed