పసుపులేటి నా ఆత్మబంధువు : చిరు

by Shyam |
పసుపులేటి నా ఆత్మబంధువు : చిరు
X

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు తుదిశ్వాస విడిచారు. యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. పసుపులేటి ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పసుపులేటి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామారావు నా ఆత్మబంధువు అని, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయనకు నేనంటే ఎంత అభిమానమో, నాకు అతనంటే అంతే అభిమానమని చెప్పారు చిరు. తన కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టి మా మీద అభిమానాన్ని అలా చూపించాడన్నారు. పసుపులేటి నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమన్న చిరు… మా మీద అంత అభిమానాన్ని చూపిన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

80వ దశకం నుంచే సినిమాలతో తన జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టారు పసుపులేటి. తొలుత విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్టుగా పనిచేసిన ఆయన తర్వాత జ్యోతిచిత్రలో వర్క్ చేశారు. ప్రస్తుతం సంతోషం సినీ పత్రికకు జర్నలిస్టుగా సేవలు అందిస్తున్న ఆయన మహానటి సావిత్రి, మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు సినీ దిగ్గజాల జీవితాలపై పుస్తకాలు రాశారు. ఎన్టీఆర్, చంద్రమోహన్, మురళీమోహన్ లాంటి సీనియర్ల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా మెలిగిన జర్నలిస్ట్ పసుపులేటి. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు.

Advertisement

Next Story

Most Viewed