- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పోడు’ కష్టాలు.. తెలంగాణలో మహిళా నేతల పోరాటం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పలు రాజకీయ పార్టీల నేతలంతా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశారు. ఒక్కొక్కరుగా ప్రజల సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో అటవీ గూడేల్లో అందరికీ తానున్నానంటూ అండగా నిలిచిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఇటీవల ‘పోడు భూముల హక్కుల రక్షణ భరోసా’ యాత్రను ప్రారంభించారు. ఇదిలా ఉండగా రాజన్న రాజ్యమే ధ్యేయంగా పార్టీ ఆవిర్భావం అనంతరం జనాల్లోకి వెళ్లేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దీక్షను కొనసాగిస్తూనే గిరిజనులకు అతి పెద్ద సమస్యగా మారిన పోడు కష్టాలపై ఆమె దృష్టిసారించనున్నారు. ఇదిలా ఉండగా పోడు సమస్యలపై పోరాటాన్ని ఇద్దరు మహిళా నేతలు ప్రారంభించడం విశేషం.
పోడు సమస్య జటిలం..
తెలంగాణలో పోడు సమస్య రోజురోజుకూ జటిలంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. అయినా నేటి వరకు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. దీంతో గిరిజనులు, అటవీ అధికారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోడు భూముల వ్యవహారంలో ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి అటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రభుత్వంపై పోరును ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా సీతక్క ఇటీవల పోడు అంశానికి సంబంధించి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. మహిళా రైతులతో అసభ్యంగా ప్రవర్తించినా, రైతులకు అన్యాయం చేసినా కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేస్తారు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇప్పుడు షర్మిల కూడా పోడు యాత్రకు సిద్ధమవుతున్నారు.
సీతక్కకు ప్రజాసంఘాల మద్దతు
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వివాదం రణరంగంగా మారుతోంది. పోడు రైతుల తిరుగుబాటుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు గిరిజనులు, ఆదివాసీలు ఈ గొడవల్లో తీవ్రంగా గాయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1.9 లక్షల ఎకరాల్లో పోడు భూములున్నట్లు అటవీశాఖ అధికారుల అంచనా. వాటిని గిరిజనులు, ఆదివాసీల నుంచి స్వాధీనం చేసుకునేందుకు వారు ఏం చేసేందుకైనా వెనుకాడకపోవడం గమనార్హం. పోడు సమస్యపై పోరాటాన్ని ప్రారంభించిన సీతక్కకు అఖిలపక్షం, కుల, ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. ఇటీవల ప్రారంభించిన యాత్రకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తన మద్దతును తెలిపారు. ఆదిలాబాద్ నుంచి మహబూబాబాద్ వరకు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలందించి సాగునీరు ఇచ్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని గుంజేడు ముసలమ్మ అమ్మవారి సాక్షిగా ఈ ఉద్యమం కొనసాగుతుందని కోదండరాం ప్రకటనలు చేశారు.
షర్మిల ములుగు జిల్లా పర్యటన వాయిదా
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ములుగు జిల్లా పర్యటనకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక తన పర్యటనను ఆమె వాయిదా వేసుకున్నారు. ములుగు జిల్లా నుంచే ఆమె ఈ పోడు యాత్రకు శ్రీకారం చుట్టాలని తొలుత నిర్ణయించారు. అందుకు ఈనెల 22వ తేదీన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మారుమూల గ్రామమైన లింగాల గ్రామాన్ని సందర్శించాలని ఆమె ప్రణాళిక చేసుకున్నారు. అక్కడి గిరిజన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకోవాలని భావించారు. అయితే వరణుడి రూపంలో ఆమెకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే తేదీలను లోటస్ పాండ్ కార్యాలయవర్గం ప్రకటించనుంది.