హార్వర్డ్ మెచ్చిన.. ‘సీమ’ టపాకాయ్

by Anukaran |
హార్వర్డ్ మెచ్చిన.. ‘సీమ’ టపాకాయ్
X

దిశ, ఫీచర్స్ : ‘చదువంటే ఆ అమ్మాయికి చెప్పలేనంత ఇష్టం’.. కానీ ఆ నిరుపేద తల్లిదండ్రులకు మాత్రం ఆడపిల్లను చదివించడం కన్నా ఓ అయ్య చేతిలో పెడితే జీవితం బాగుపడుతుందనే ఆశ. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోకపోగా, చదువుకుంటానని తల్లిదండ్రులతో వాదించి చివరకు ఒప్పించింది. అయితే వారిది వ్యవసాయాధారిత కుటుంబం కావడంతో చదువుకుంటూనే పశువులు మేపేది. పొలంలో తన కుటుంబానికి సాయం చేస్తూనే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది. ఈ క్రమంలో ఆమె చూపిన తెగువ, పడ్డ కష్టం వ‌ృథా కాలేదు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ అందుకునేలా చేసింది. ఆ మట్టిలో మాణిక్యమే.. జార్ఖండ్‌, ఒర్మంజిలోని ‘దహు’ గ్రామానికి చెందిన సీమా కుమారి. మారుమూల గ్రామం నుంచి వరల్డ్ టాప్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ పొందే వరకు సీమ ప్రయాణం నేటితరానికి స్ఫూర్తినిస్తుండగా.. ఆమె జీవిత విశేషాలు మీ కోసం..

‘ఒర్మంజి’ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలనే పాటిస్తున్నారు. చాలా మంది పిల్లలు.. ముఖ్యంగా బాలికా విద్యకు అక్కడ ప్రోత్సాహం అందడం లేదు. ఆడపిల్లలకు చిన్నవయసులోనే పెళ్లిచేస్తున్న కారణంగా ఏటా పదుల సంఖ్యలో విద్యార్థినులు బడి మానేస్తున్నారు. లింగ సంబంధిత హింస కూడా ఎక్కువే. ఇక మానవ అక్రమ రవాణాకు బలైపోయే అభాగ్యులకు లెక్కేలేదు. ఇలాంటి ఎన్నో అసమానతలు, గడ్డు పరిస్థితులున్న ప్రాంతంలో పెరిగిన అమ్మాయే ‘సీమా కుమారి’. గ్రామంలో అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లానే సీమ పేరెంట్స్ కూడా తనకు చిన్నవయసులోనే పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వారి నిర్ణయానికి అడ్డుచెప్పిన సీమ.. చదువే అన్ని సమస్యలను పరిష్కారం చూపగలదని బలంగా విశ్వసించింది. ఈ క్రమంలో సీమ జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ‘యువ’ ఎన్జీవో.

అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ‘యువ ఎన్జీవో’.. పదకొండేళ్లుగా ఒర్మంజి ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రధానంగా ‘స్పోర్ట్స్, వర్క్‌షాప్స్, ఆల్-గర్ల్స్ స్కూల్’ అనే మూడు ఇంటర్ కనెక్టెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా బాలికల్లో విశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు చదువులో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది. పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన ఇన్‌పుట్స్ ఇవ్వడానికి సంపూర్ణమైన, ఇంటెన్సివ్ వ్యూహాన్ని ఇది సూచిస్తుంది.

‘యువ’లో భాగంగానే ఫుట్‌బాల్ గేమ్‌పైనే దృష్టి పెట్టిన సీమ.. క్రమంగా కోచ్‌గా ఎదగడం విశేషం. సీమ చదివే పాఠశాల కూడా ఆమెను అన్ని విధాలా ప్రోత్సహించింది. అందుకు ఈ స్కూల్‌లోని ఉపాధ్యాయ -విద్యార్థి నిష్పత్తి (9: 1) కూడా దోహదపడింది. ఇన్నోవేటివ్, డైవర్స్ టీచర్స్ ఇక్కడ చదివే విద్యార్థులు బిగ్ డ్రీమ్స్ అచీవ్ చేసేలా మోటివేట్ చేస్తుంటారు. హార్వర్డ్ నోటిఫికేషన్ గురించి కూడా సీమకు అలానే తెలియగా.. దరఖాస్తు చేసుకుని, తన ప్రతిభాపాటవాలతో స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది. కాగా 2019-20లో వాషింగ్టన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ‘అకాడమిక్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్’ కోసం ఓ ఏడాదిపాటు యూఎస్‌లో ఉండటం తను స్కాలర్‌షిప్ పొందడంలో ఉపయోగపడింది.

చదువు, స్పోర్ట్స్‌లో రాణిస్తున్న సీమ టాలెంట్‌ను గుర్తించిన హార్వర్డ్ యూనివర్సిటీ.. తనకు ఎంట్రీతో పాటు పూర్తి స్కాలర్‌షిప్ అందించింది. ఇదే కాదు.. వెర్మంట్‌(యూఎస్)లోని ‘మిడిల్బరీ కాలేజ్’, డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్, హర్యానాలోని అశోక యూనివర్సిటీలు కూడా సీమ పై చదువుల కోసం ఆహ్వానాలు పంపడం విశేషం. ఇక ప్రియాంక చోప్రా, నవ్య నవేలి సైతం సీమను ప్రశంసించారు.

2012లో ‘యువ’ కోసం ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించినప్పుడు వివిధ గ్రామాలు, భిన్న కులాలకు చెందిన అమ్మాయిలతో మాట్లాడాను. ఇక్కడకు వచ్చే విదేశీ సందర్శకులను కూడా కలుసుకున్నాను. ప్రపంచం తెలిసేకొద్దీ సమాజంలోని వివక్ష, అమ్మాయిల ప్రతిభకు అడ్డు తగులుతున్న ఆచార, సంప్రదాయాలను గమనించాను. ఇప్పటికీ నా గ్రామంలో పెద్దగా మార్పులేం రాలేదు. అమ్మాయికి యుక్తవయసు రాగానే పెళ్లి చేసేస్తారు. తరతరాలుగా ఇక్కడ ఇదే సంస్కృతి కొనసాగుతోంది. ఈ కారణంగా చదువు మానేస్తున్నవారు తమ అత్తమామల వద్ద పనిచేసే బాధ్యత మోస్తున్నారు. ఇక ఒకటి, రెండు సంవత్సరాల్లో ఒక బిడ్డను వారికి అందించకపోతే మరిన్ని బాధలు అనుభవించాల్సిందే. కానీ పురుషుల విషయంలో అలా జరగడం లేదు. అందుకే స్ర్తీ-పురుషుల మధ్య గల వివక్షను రూపుమాపడమే లక్ష్యంగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఇందుకోసం నా గ్రామంలోని మహిళల కోసం ఒక సంస్థను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నా. అది వారికి వృత్తిపరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా స్వతంత్రాన్ని పెంపొందిస్తుంది. ఈ క్రమంలో వారి హక్కుల గురించి అవగాహన కల్పిచేందుకు ప్రయత్నిస్తున్నా.
– సీమ కుమారి

Advertisement

Next Story