'కలరింగ్ ఇస్తూ మమ్మల్ని కలర్ ఫుల్ గా మోసం చేస్తున్నారు'

by Sumithra |   ( Updated:2021-10-27 03:52:10.0  )
Mokkajonna-11
X

దిశ, దమ్మపేట: నాసిరకపు మొక్కజొన్న విత్తనాలను మార్కెట్ లో జోరుగా విక్రయిస్తున్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు మకాం మార్చిన ఆర్గనైజర్లు రైతుల శ్రమను దోచుకుంటున్నారు. బ్రాండెడ్ విత్తనం అనే కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. దమ్మపేట మండలం మొక్కజొన్న వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడి రైతులు కూడా ఎక్కువగా మొక్కజొన్న పంట వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అదే అదునుగా భావించిన కొందరు ఆర్గనైజర్లు నాసిరకపు విత్తనాలు మార్కెట్లోకి తీసుకొచ్చి దోచుకుంటున్నారు.

కొన్నిచోట్ల అయితే ట్రైల్ వెరైటీ వంగడం ఇచ్చి రైతులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎకరాకు పదివేల పెట్టుబడి సహాయం అందిస్తామని మాయమాటలు చెప్పి రైతులకు విత్తనాలు ఇచ్చి, ఆ తర్వాత దిగుబడి రానిపక్షంలో ఆర్గనైజర్లు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే దిశ గత సంవత్సరం కొంతమంది రైతులను మోసం చేసిన ఆర్గనైజర్లపై వార్తలు ప్రచురించి న్యాయం దిశగా పోరాడింది. ఈ ఏడాది కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ ప్రాంతంలో తిష్ట వేసుకొని కూర్చున్న ఆర్గనైజర్లు వేల ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు అందజేస్తున్నారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చిన డబ్బులకు అధిక వడ్డీలు తీసుకుంటూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు. కొంతమంది ఆర్గనైజర్లు అయితే రైతులకు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండానే విత్తనాలు అందజేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు నాసిరకం మొక్కజొన్న విత్తనాలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed