టీఆర్ఎస్‌ పార్టీకి నేతల ద్రోహం..! పరేషాన్ చేసిన సీక్రెట్ ఆపరేషన్

by Anukaran |
trs leader
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పార్టీకి అంతర్గతంగా జరిగిన ఆపరేషన్ పరేషాన్ చేస్తుందా లేక పని చేస్తుందా అన్నదే లీడర్స్‌లో మెదులుతున్న ప్రశ్న. కొంతమంది నాయకులు పార్టీకి ద్రోహం చేశారన్న భావన బలంగా టీఆర్ఎస్ వర్గాల్లో నాటుకపోయింది. ఐదు నెలలుగా నిరాటంకంగా ప్రచార పర్వాన్ని కొనసాగించి క్షేత్ర స్థాయి నాయకులకు కూడా ప్రాధాన్యత కల్పించినప్పటికీ మోసం చేశారన్న అభిప్రాయం టీఆర్ఎస్ ముఖ్య నాయకుల్లో నెలకొంది. నియోజకవర్గంలోని చాలా చోట్ల టీఆర్ఎస్ నాయకులు కోవర్టు ఆపరేషన్లకు పాల్పడ్డారా అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతున్నట్టు సమాచారం. పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు కూడా చివరి క్షణంలో పార్టీ చెవిలో ’గులాబీ‘ పువ్వు పెట్టినట్టుగా భావిస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి డాటా సేకరిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్య నాయకులు కూడా కొంతమంది పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానికేతర నాయకుల విషయంతో పాటు పోలింగ్ రోజైన శనివారం జరిపిన సమీకరణాల విషయాలను కూడా రట్టు చేయడంలో సొంత పార్టీ నేతల ప్రమేయం ఉందా అన్న అనుమానం కూడా నెలకొంది.

ముందే పసిగట్టారా..?

ప్రచార పర్వంలో లోకల్ లీడర్ల ప్రమేయంతోనే సాగించిన టీఆర్ఎస్ అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం స్థానికులకు సంబంధం లేకుండా జాగ్రత్తపడ్డట్టుగా తెలుస్తోంది. కండువాలు కప్పుకోవడం, కప్పించడంతోనే సరిపెట్టిన చాలా మంది నాయకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం చేరడంతో కొన్ని వ్యూహాలను అత్యంత సీక్రెట్‌గా అమలు పర్చినట్టు స్పష్టం అవుతోంది. ఒకటి రెండు విషయాల్లో స్థానికుల ప్రమేయం ఉండాలని భావించినప్పడు.. స్థానికేతర నాయకులను కూడా లోకల్ లీడర్లతో అటాచ్ చేయించారు. దీంతో తమముందు ఉంచుకున్న లక్ష్యాన్ని అమలు చేసేందుకు డైరెక్ట్ ఓటరు వరకు చేరుకునే విధంగా పకడ్బందీగా వ్యూహం రచించినట్టుగా స్పష్టం అవుతోంది. సీక్రెట్ ఆపరేషన్ల విషయం తెలుసుకున్న కొంతమంది స్థానిక నాయకులు మాత్రం కినుక వహించినప్పటికీ.. ఓటరుతో పెట్టుకున్న డైరెక్ట్ అటాచ్‌మెంట్ సత్ఫలితం ఇస్తుందని అంచనా వేసే సీక్రెట్ స్కెచ్ అమలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యర్థి ఈటలపై ఉన్న అభిమానం కొంతమంది లీడర్లను డామినేట్ చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తించే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్టుగా స్పష్టం అవుతోంది.

గెలిచే పరిస్థితి లేదని..

హుజూరాబాద్‌లో ప్రత్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ అత్యంత బలమైన నాయకుడు కావడంతో.. టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు చేపట్టిన ఆపరేషన్లను బయటకు పొక్కనీయనట్టుగా అర్థం అవుతోంది. ఇక్కడ ఎన్నికల వాతావరణం నెలకొన్నప్పటి నుండి గెలుపునకు సూదూర ప్రాంతాల్లో ఉన్నామన్న విషయాన్ని పసిగట్టి అందుకు తగ్టట్టుగానే ముందుకు సాగారు. దీంతో చివరి నిమిషంలో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితికి టీఆర్ఎస్ చేరినట్టుగా తెలుస్తోంది. సునాయస విజయాన్ని నిలువరించగలిగిన తాము గెలుపు స్వారీ ఎక్కడానికి అవసరమైన అన్ని రకాల ఎత్తులను అత్యంత రహస్యంగా కొనసాగించారు. కోవర్టులకు చిక్కకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed