'దిశ' మీడియాపై దుష్ప్రచారం వెనుక దాగిన రాజకీయ శక్తులు?

by Anukaran |   ( Updated:2021-08-12 08:26:54.0  )
దిశ మీడియాపై దుష్ప్రచారం వెనుక దాగిన రాజకీయ శక్తులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సమాజంలో రోజురోజుకూ పాఠకుల విశేష ప్రజాదరణను చూరగొంటున్న ‘దిశ‘ పత్రికపై కొన్ని శక్తులు అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. దిశ మీడియాకు ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను దెబ్బ కొట్టాలనుకుంటున్నాయి. ‘సీతంపేట టీఆర్ఎస్’ అనే వాట్సాప్ గ్రూపులో గురువారం (ఆగస్టు 12, 2021న) ‘దిశ‘ ఒక కథనాన్ని ప్రచురించిందనే పేరుతో నకిలీ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేసారు. ఆ క్లిప్పింగ్‌ను, దాన్ని సృష్టించిన వ్యక్తి వివరాలను పాఠకులకు అందిస్తున్నాం.

అసలు నిజం ఏంటి?

‘దిశ‘ పత్రిక పుట్టిందే వాస్తవాలను ప్రజలకు చేరవేయడం కోసం. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా నిఖార్సైన పాత్రికేయ విలువలను పాటిస్తున్నది. అందుకే అతి తక్కువ కాలంలోనే యావత్తు తెలంగాణ సమాజంలోని ప్రజానీకంలోకి విస్తృతంగా వెళ్ళగలిగింది. ప్రచురించే వార్తలు, కథనాలకు ఆదరణ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తుండగా మరికొన్ని శక్తులు తప్పుడు ప్రచారానికి దిగి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే ‘సీతంపేట టీఆర్ఎస్‘ అనే వాట్సాప్ గ్రూపులో ‘నా మీద ఒక యాదవ కుక్కను నిలబెట్టిండు కెసిఆర్..’ అంటూ ఈటల చెప్పినట్లు ఒక వార్త పోస్టు అయింది. దీన్ని 8639832516 అనే మొబైల్ నెంబరు కలిగిన వ్యక్తి పోస్టు చేశారు.

నిజానికి ఈ వార్తను ‘దిశ‘ పత్రిక ప్రచురించలేదు. నిత్యం ‘దిశ‘ పత్రిక వాడుతున్న ఫాంట్ కూడా అది కాదు. ఆ వార్తతో ‘దిశ‘కు ఎలాంటి సంబంధం లేదు. దురుద్దేశపూర్వకంగానే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వార్తను సృష్టించి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఆ నెంబరు కలిగిన వ్యక్తి.

“ఈటల రాజేందర్‌కు గానీ, టీఆర్ఎస్ పార్టీకి గానీ కొమ్ముకాసే నైజం ‘దిశ‘ది కాదు అని పాఠకులకు సగర్వంగా తెలియజేస్తున్నాం.”

కొన్ని శక్తులు ఈ దుష్ప్రచారానికి పాల్పడడానికి రెండు కారణాలు ఉన్నట్లు తేలింది. మొదటిది, ‘దిశ‘ పత్రికకు ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీతయను దెబ్బతీయడానికి పాల్పడడం. రెండవ కారణం, ‘దిశ‘ ప్రచురించే వార్తలు, కథనాలకు పాఠకుల్లో నమ్మకం ఉన్నది కాబట్టి దాన్ని వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవడం. అయితే, అందుకు ‘దిశ‘ను ఉపయోగించడం అనైతికం మాత్రమే కాక చట్టవిరుద్ధమైన, నీతిబాహ్యమైన చర్యే అవుతుంది. దీన్ని లీగల్‌గా ఎదుర్కోడానికి ‘దిశ‘ ఏ మాత్రం వెనుకాడదు.

వాస్తవం వైపే పయనం..

దిశ మీడియా ఎల్లప్పుడూ వాస్తవం వైపే పయనిస్తుందని, ఏ పార్టీకీ, ఏ వర్గానికీ, ఏ వ్యక్తికీ దిశ కొమ్ము కాయబోదని, ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు, కేసులు, నిర్బంధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం.”
Advertisement

Next Story