కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దేశ వృద్ధి అంచనాను తగ్గించిన నోమురా!

by Harish |   ( Updated:2021-04-12 05:07:20.0  )
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దేశ వృద్ధి అంచనాను తగ్గించిన నోమురా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్‌ సంస్థ నోమురా 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 13.5 శాతం నుంచి 12.6 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థికవ్యవస్థ దెబ్బతినే అవకాశాలున్నాయని నోమురా తన నివేదికలో పేర్కొంది. కరోనా సెకెండ్ వేవ్ మరింత విజృంభిస్తే ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు 12.2 శాతానికి పడిపోవచ్చని ఈ నెల మొదట్లో నోమురా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతుండటంతో ఆర్థికవ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కనబడుతుందని నోమురా ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కరోనా టీకా పంపిణీలో మెరుగుదల వల్ల స్థిరమైన వృద్ధి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 32.5 శాతం సాధించగలదని, అంతకుముందు ఊహించిన 34.5 శాతం కంటే స్వల్పంగా తగ్గొచ్చని నోమురా పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed