హోంమంత్రి సుచరిత ఎఫెక్ట్.. అయ్యన్నపాత్రుడిపై కేసు

by srinivas |   ( Updated:2021-09-24 03:01:04.0  )
హోంమంత్రి సుచరిత ఎఫెక్ట్.. అయ్యన్నపాత్రుడిపై కేసు
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ రాజకీయాల్లో ఆయనో సీనియర్ నాయకుడు. ముక్కుసూటిగా ఉంటారు. సొంత పార్టీ అని లేదు.. ఇతర పార్టీ అని లేదు ఎవరైనా సరే విమర్శలు దాడి చేయడంలో ఆయనకు మరెవరు సాటిరారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం గడించిన ఆ సీనియర్ నేత మైకు అందుకున్నారంటే ఎవరినీ వదిలిపెట్టరు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గల్లీ లీడర్ల వరకు అందర్నీ ఏకిపారేస్తారు. అలాంటి సీనియర్ నేత ఇటీవల టంగ్ స్లిప్ అయ్యారు. ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంతకీ ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది కదూ. ఇంకెవరు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు.

కోడెల సంస్మరణ సభలో వ్యాఖ్యల కలకలం

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభలో ముఖ్య అతిధిగా హాజరైన అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పరుషపదజాలంతో సైతం విరుచుకుపడ్డారు. అలాగే హోంమినిస్టర్ సుచరితపైనా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఉపయోగించని పదజాలాన్ని అయ్యన్న ఉపయోగించారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మహిళా హోంమంత్రి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ వైసీపీ నేతలు అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు. అయ్యన్న వ్యాఖ్యల ఎఫెక్ట్ చివరకు చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు తెలిసిందే.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడిన అయ్యన్నపాత్రుడు హోంశాఖ మంత్రి సుచరితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో సిగ్గు లజ్జా ఉందా అంటూ విరుచుకుపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై అరండల్ పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలకు సంబంధించి వీడియోను సైతం పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లోనూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశ్నించేవారిపైనే అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Advertisement

Next Story