ఆ రూల్స్ ఆడవాళ్లకెందుకు..? మహిళలకు శాశ్వత కమిషన్ విషయంలో ఆర్మీ తీరుపై ‘సుప్రీం’ అసహనం

by Anukaran |
permanent commission for women in Indian army
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిట్నెస్ ప్రమాణాలను కారణంగా చూపుతూ ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది వారి సమానత్వపు హక్కును హరించడమేనని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న విధంగా.. ఇండియన్ ఆర్మీ, నేవీలో మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్లను ఏర్పాటు చేయాలని కోరుతూ 80 మంది మహిళలు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఫిట్నెస్ ఆధారంగా మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడం ఏకపక్ష చర్య అని తెలిపింది. షేప్-1 క్రైటీరియాగా ఉన్న శారీరక ప్రమాణాలు పురుష ఆఫీసర్లకు మాత్రమే వర్తిస్తాయని పర్మనెంట్ కమిషన్ ఇచ్చిన తొలి రోజుల్లోనే ఆ ప్రమాణాలను పాటించినట్టు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇది మహిళలకు వర్తింపజేయడం ఏకపక్షమే గాక వివక్షాపూరితమైందని అసహనం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ, విజిలెన్స్ ఆధారంగా మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలని తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘మన సమాజ నిర్మాణాన్ని చూస్తే మగవారి చేత మగవారి కోసం ఏర్పాటు చేసుకున్నదని అర్థమవకమానదు. పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం దానిపై ఉంది. ఈ వ్యవస్థలో మార్పులు రావాలంటే కొన్ని సవరణలు, సర్ధుబాటులు అవసరం..’ అంటూ తీర్పునిచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వపు హక్కు బయట వేరే రూపాలు సంతరించుకున్నదని అన్నారు. తమ ఎదుట ఉన్న మహిళలు ఆర్మీలో తమకు శాశ్వత కమిషన్ కావాలని వచ్చారని తెలిపారు. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై రెండు నెలల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed