పేద పిల్లల కలలను నెరవేరుస్తున్న ‘సాయంభరతా’

by Shyam |
పేద పిల్లల కలలను నెరవేరుస్తున్న ‘సాయంభరతా’
X

దిశ, ఫీచర్స్ : వెస్ట్ బెంగాల్, బీర్‌భూమ్ జిల్లాలోని తాటిపరాలో నెలకు రూ. 3,000 సంపాదించే రోజువారీ కూలీ మధుసూదన్ ఘోష్.. తన కొడుకు బాపన్‌కు పాఠ్య పుస్తకాలు కొనడానికి రూ. 500 కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుబ్రతా బోస్‌ను జనవరి 2014లో సంప్రదించాడు. కానీ ఆ డబ్బు ఇచ్చేందుకు ముందు తిరస్కరించిన సుబ్రతా.. మధుసూదన్ తన కుమారుడి మార్కులు చూపించడంతో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఇది బాపన్ ఒక్కడి పరిస్థితే కాదు.. అలాంటి పేద పిల్లలెంతో మందికి ఎదురయ్యే అనుభవమే. దీంతో ఈ ఉదంతం బోస్‌‌ను ఆలోచనలో పడేసింది. మెరిట్ ఉన్న పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో.. తన ఏడుగురు స్నేహితులతో కలిసి 2014 ఆగస్టు 29న ‘సాయంభరతా రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ను స్థాపించాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ ఫౌండేషన్‌ సాయంతో చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడి సమాజ సేవకులుగా కొనసాగుతున్నారు.

సాయంభరతా(Sayambharataa) ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించిన బోస్ అండ్ ఫ్రెండ్స్… దాదాపు 45 శాతం మంది విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు సామాజిక-ఆర్థిక కారణాల వల్ల 8వ తరగతి తర్వాత ఎడ్యుకేషన్‌కు దూరంగా ఉన్నారని తేలింది. దీంతో బకరేశ్వర్ సహా చుట్టుపక్కల 10 గ్రామాల(బహదుర్‌గంజ్, బురేమా, గదాధర్‌పూర్, దేదోహా, గోహలియారా, టెతుల్‌బంద్, ముక్తిపూర్, అసన్సులి, తాటిపరా, లతుంటోలా) నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేదుకు సాయంభరతా పని చేస్తుంది. 8, 9,10 తరగతులకు చెందిన 82 మంది విద్యార్థులకు గణితం, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను బోధించేందుకు మూడు సహాయక విద్యా కేంద్రాలతో సాయంభరతా ప్రారంభమైంది. ప్రతి రోజూ ఉదయం మూడు గంటల పాటు కోచింగ్ ఇవ్వడం వల్ల గ్రేడ్‌లు మెరుగుపడటంతో తమ పిల్లలను సాయంభరతా పాఠశాలల్లో చేర్పించాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో పెరిగింది. ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఈ సాయాన్ని పొందుతున్నారు. ఫస్ట్ బ్యాచ్10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించడమే కాకుండా తమ గ్రామంలోని పిల్లలందరినీ సాయంభరతాలో చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు. వారు తమ గ్రామంలోని నిరక్షరాస్యులకు ప్రభుత్వ ఫారాలను పూరించడానికి, వివిధ సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి సహాయం చేశారు.

ప్రస్తుతం బాపన్.. షిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ & టెక్నాలజీలో MTech చదువుతున్నాడు. బాపన్ అక్క తారా కూడా సాయంభరతా సాయం అందుకుని.. రాంపూర్‌హాట్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ నెలకు రూ. 30,000 సంపాదిస్తూనే మరో విద్యార్థి ఎడ్యుకేషన్‌కు హెల్ప్ చేస్తోంది. సాయంభరతాలో చదువుకున్న అసన్సులికి చెందిన మరో ఆరుగురు బాలికలు నర్సింగ్‌ విద్య పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఉమా శంకర్ అనే విద్యార్థి ఐఐటీ కాన్పూర్ నుంచి కెమిస్ట్రీలో ఎంఎస్ చేస్తున్నారు. ‘నా కొడుకు కోసం అత్యుత్తమ ట్యూటర్‌లను-ఐఐటీ ప్రొఫెసర్‌లను ఏర్పాటు చేశారు. ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గార్గీ మామ్, నా కొడుకుకు కెమిస్ట్రీపై ఆసక్తిని గుర్తించడంలో సహాయపడింది’ అని ఉమాశంకర్ తల్లి నియతి చెప్పారు.

‘పిల్లలు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి సాయంభరతా సహాయం చేస్తుంది. ఇది ఒక రకమైన వడ్డీ రహిత రుణం. మరొక నిరుపేద బిడ్డను ఆర్థికంగా దత్తత తీసుకోవడం ద్వారా తిరిగి రుణం తీర్చుకోవాలి. ఉన్నత చదువులు చదివేందుకు ఒక్కో చిన్నారికి సంస్థ ఏడాదికి రూ.24,000 వెచ్చిస్తోంది. కానీ మా విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు సంతోషానిస్తున్నాయి. ఒకప్పుడు పేద పిల్లల్ని తమ ఆశయం గురించి అడిగినప్పుడు ఏం చెప్పేవారు కాదు. పేదరికం కలలు కనే హక్కును చిదిమేసింది. ఓ విద్యార్థిని ఆమె కలల గురించి అడిగినప్పుడు, ఆమె ఏడవడం ప్రారంభించింది. తాను డాక్టర్‌ని కావాలనుకుంటున్నానని చెప్పడానికి ముందు తాను పేదమ్మాయి అని, దీనస్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సాయంభరతా వారి కలలు సజీవంగా ఉండేలా చూస్తోంది’
– సుబ్రతా బోస్‌, ఫౌండర్

పిల్లల ముఖాలను చిరునవ్వుతో వెలిగించడం మన హృదయాలను నింపుతుంది. అలాంటి చిన్నారులకు రుణపడి ఉంటాం”
– దేబ్జానీ మిత్ర, కోఫౌండర్, సాయంభరతా

Advertisement

Next Story

Most Viewed