- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిల్లులు రావు.. అప్పులు తీరవు! ఆత్మహత్యలకు పాల్పడుతున్న సర్పంచ్‌లు
దిశ, తెలంగాణ బ్యూరో : కొందరు గ్రామాభివృద్ధి కోసం.. మరికొందరు రాజకీయ పలుకుబడి కోసం సర్పంచ్‌గా బరిలో దిగి గెలిచారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చారు. గెలిచినప్పటి నుంచి ఏదో ఒక అభివృద్ధి పని చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా.. అప్పులు తెచ్చి ప్రజల వద్ద మాట పోకుండా పనులు చేస్తున్నారు. మరోవైపు ట్రాక్టర్ ఈఎంఐలు, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం మరి కొన్ని అప్పులు చేస్తున్నారు. కానీ చేసిన పనులకు బిల్లులు రాక.. అప్పులకు వడ్డీలు పెరిగి సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కాడా లేని విధంగా తెలంగాణలో సర్పంచ్ లు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.
ఓ సర్పంచ్ ఆవేదన..
“ఏడాది నుంచి గ్రామంలో వివిధ పనులను సొంత డబ్బులతో చేపించాం. ఇవ్వాలో, రేపో బిల్లులు వస్తాయంటూ ఎదురుచూశాం. మార్చి 28న అధికారులు రూ. 3.50 లక్షలకు ఎఫ్‌టీఓ రిలీజ్చేశారు. ఎఫ్‌టీవో అంటే దాదాపు చెక్కు వచ్చిన్నట్టే. కొంతైనా బిల్లులు వస్తున్నాయని సంబురపడ్డాం. కానీ ఇప్పటి వరకు నగదు రావడం లేదు. పంచాయతీ ట్రెజరీల్లో పైసల్లేవంటూ తిప్పి పంపుతున్నారు. ఈ రూ. 3.50 లక్షలతో పాటు ఇంకో రూ. 6 లక్షలు రావాల్సి ఉంది. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడు వచ్చే బిల్లులన్నీ మిత్తీలకే సరిపోయేలా ఉన్నాయి.’’
“సౌందర్య, కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపేట సర్పంచ్.
చిక్కుల్లో స్థానిక సంస్థలు
ప్రస్తుతం గ్రామాల్లో ఖర్చులు పెరిగిపోయాయి. ఆదాయం మాత్రం దయనీయంగా మారింది. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీల సొంత ఆదాయమే గ్రామాల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు వనరులు. ప్రభుత్వం హంగూ, అర్బాటంతో పల్లె ప్రగతి ప్రణాళికను తీసుకువచ్చి నిధులిస్తామని చెప్పుతున్నా… విద్యుత్ బకాయిలు, పంచాయతీ నిర్వహణ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐల పేరిట ఆ నిధుల్లో తెలంగాణ సర్కారు కోత పెట్టింది. ఉపాధి హామీ నిధులు నేరుగా గ్రామాలకు మంజూరవుతున్నా.. వాటిలో పరిమిత అంశాలుంటున్నాయి.
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉంటే, వాటిలో సొంత ఆదాయం పరిపుష్ఠిగా ఉన్నవి వందల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, వీధిలైట్ల ఏర్పాటుకు సర్పంచ్‌లు పడరాని పాట్లు పడుతున్నారు. పంచాయతీలకు నిధులు ఉన్నా లేకపోయినా, గ్రామాల్లో కొన్ని పనులు చేయడం తప్పనిసరి కావడంతో… నిధులు లేకపోయినా సొంతంగా వెచ్చించి అయినా చేయించాల్సి వస్తోంది. చాలా గ్రామాల్లో సర్పంచులు తమ సొంత సొమ్ములను ఖర్చు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయిస్తున్నారు. పరువు, మర్యాదలు, గౌరవం నిలుపుకోవడం కోసం మరికొంతమంది సొంత సొమ్ములతో పంచాయతీ పనులు చేయక తప్పని పరిస్థితి. దీంతో ఎన్నికైనప్పటి నుంచే అప్పుల పాలవుతున్నారు. ఇటీవల వరుసగా సర్పంచ్‌లు సర్కారుకు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారికి ఉపశమనం మాత్రం దొరకడం లేదు.
మరణమే మేలు అనుకుంటున్నారు..
గతంలో రైతు ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాప్రతినిధుల ఆత్మహత్యలు కూడా నమోదవుతున్నాయి. నిధులు రాక సర్పంచ్‌లు ప్రాణం తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కాశగూడెం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన యువ సర్పంచ్ షేక్ అజారుద్దీన్ ఆర్థిక ఇబ్బందులతో గత ఏడాది నవంబర్13న ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దగా ఆస్తులు లేని అజారుద్దీన్.. సొంత పనులు మానుకుని ఊరి కోసం తిరిగారు. గ్రామంలో పనుల కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో పురుగుల మందు తాగాడు. షేక్ అజారుద్దీన్ గ్రామంలో అప్పుచేసి కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. వాటి నిధులు ఉన్నతాధికారులు విడుదల చేయలేదు. దీంతో అప్పు పెరిగింది. భార్య వస్తువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
* సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ ముంజ మంజుల కూడా పల్లె ప్రకృతివనం నిధులు రాక ఏప్రిల్ 8న ఆత్మహత్యాయత్నం చేశారు.
* ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్ ఆనందరెడ్డి గత నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు. వీటికి సంబంధించిన బిల్లులు రాక అప్పుకు మిత్తీ పెరిగి చెల్లించే పరిస్థితి లేక ఉరేసుకున్నాడు.
* వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ అపర్ణ కూడా గత ఏడాది నవంబర్ 26న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
* సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం మావినేల సర్పంచ్ చంద్రప్ప ఏప్రిల్ 27న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
* మహబూబ్ నగర్ జిల్లా రఘుమాపూర్ గ్రామ మహిళా సర్పంచ్ ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేశారు.
* పలుచోట్ల ఉప సర్పంచ్‌లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదులో ఎన్ని కారణాలున్నా… ప్రధాన కారణం మాత్రం ఆర్థిక కష్టాలు. గ్రామ పనులకు తెచ్చిన అప్పులతో పాటుగా ఆదాయం లేకపోవడం, తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేక ఊపిరి తీసుకుంటున్నారు.
నిర్వహణ భారం
రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా… 7100 మైనర్ పంచాయతీలున్నాయి. వీటితో కొత్తగా ఏర్పాటైన గ్రామాలు 4383 ఉన్నాయి. ఇవన్నీ మరింత చిన్న జీపీలు. 500 నుంచి 600 వరకు జనాభా ఉన్న పంచాయతీలే. వీటికి స్వీయ ఆదాయం చాలా తక్కువ. అటు ప్రభుత్వం నుంచి వచ్చే పల్లె ప్రగతి నిధులు కూడా తక్కువే. అయితే ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీటిపై భారాన్ని మోపింది.
ట్రాక్టర్ల నెలవారీ ఇన్‌స్టాల్ మెంట్ మినిమమ్ రూ.11 వేలు ఉండగా… డ్రైవర్ జీతం రూ. 8,500 ఉంది. గ్రామ పంచాయతీ ఏదైనా కార్మికుల వేతనం రూ. 8,500గా నిర్ణయించారు. ఇక ట్రాక్టర్‌కు రోడ్ ట్యాక్సులు నెలకు రూ. 1000నుంచి రూ. 1400 వరకు చెల్లించాల్సి వస్తోంది. వీటికి తోడు డీజిల్ ఖర్చులు, మైనర్ రిపేర్లకు ఖర్చులు అదనం. కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ట్రాలీకి, ట్యాంకర్‌కు కూడా లోన్ తీసుకున్నారు. ఇలాంటి వారు నెలకు రూ.17 వేల వరకు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించాల్సి వస్తోంది. జీపీలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులే ఆధారం. పన్నులు ఎక్కువగా వసూలు కావు. వీటితోనే సిబ్బంది వేతనాలు, జీపీ మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోంది.
మేజర్ పంచాయతీలకు ఒకింత ఇబ్బందులు లేకున్నా చిన్న పంచాయతీలకు ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. ఏటా రూ. 3 నుంచి 4 లక్షలు కూడా రావడం లేదు. కానీ ట్రాక్టర్ ఈఎమ్‌ఐ, డీజిల్ ఖర్చులు, డ్రైవర్, మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు, కరెంట్ బిల్లులు, పంచాయతీ మెయింటెనెన్స్ అన్ని ఖర్చులు కలిపితే ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ అవుతున్నాయి.
రూ. 1100 కోట్లు పెండింగ్
పంచాయతీలకు ప్రతినెలా కోట్లు ఇస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కొన్నింటికే పరిమితమవుతోంది. నిధుల విడుదలలో చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పంచాయతీలకు రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవోలు జారీ చేస్తున్నా… నిధులను మాత్రం ఫ్రీజింగ్లో పెడుతోంది. ఇటీవల ఈ పల్లె ప్రగతి నిధుల్లో కోత పెట్టింది. గత నెలలో పల్లె ప్రగతి కింద రూ. 260 కోట్లకే పరిమితం చేసింది. అయితే విడుదల చేసిన నిధులు ఖాతాల్లో ఉన్నట్లు చూపిస్తున్నా చెక్కులు మాత్రం పాస్ కావడం లేదు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ నెల మొదటి వారం వరకు రూ. 1100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెక్కులన్నీ సిద్ధమయి ట్రెజరీకి వెళ్లాయి. కానీ ట్రెజరీల నుంచి మాత్రం బయటకు రావడం లేదు.
పల్లె ప్రగతిలో రూ. 339 కోట్లను నెలనెలా ఇచ్చేలా నిర్ణయించినా తగ్గుతూ వస్తున్నాయి. మే నెలకు సంబంధించి మొత్తం రూ. 273 కోట్లు విడుదల చేయగా… ఇందులో గ్రామ పంచాయతీలకు రూ. 232.06 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 27.28 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ. 13.65 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామాలకు నిధులు కోత పెట్టినట్లు అయింది.
పనులే భారం
ప్రతీ గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలూ.. ఇవన్నీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించింది. కానీ, అందుకు తగిన నిధులను సమయానికి ఇవ్వడం లేదు. పనులు పూర్తి చేయాలని మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టినట్టుగా సర్పంచ్‌లకు కూడా టార్గెట్లు పెట్టారు. నోటీసులు ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ డబ్బు మాత్రం ఇవ్వడం మానేశారు. టార్గెట్లు పూర్తి చేయడం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేయించిన సర్పంచ్‌లు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
పవర్ లేని పెత్తనం
పేరుకే సర్పంచ్‌లు..! ఊరిలో ఒక నల్లా పెట్టించలేరు.. ఒక స్ట్రీట్ లైటు వేయించలేరు.. ఒక రేషన్‌కార్డు ఇప్పించలేరు.. ఒక పింఛన్ రాయించలేరు. ఆఖరికి మోరీల నుంచి బురద కూడా తీయించలేరు! అన్నిట్లా రాష్ట్ర సర్కారుదే పెత్తనం. ప్రభుత్వం తరఫున ఆఫీసర్లదే పెద్దరికం. ఆఫీసర్లు చెప్పిన దానికి ‘ఊ..’ కొట్టకపోతే షోకాజ్ నోటీసులు.. ఇంకేమన్నా అంటే పదవి ఊస్టింగ్. సర్పంచుల చేతుల్లో పవర్, పైసలు రెండూ లేకుండా పోయాయి. కేంద్రం ఇచ్చే ఈజీఎస్ ఫండ్స్‌తో ఊళ్లలో రైతువేదికలు, శ్మశాన వాటికలు, విలేజ్ పార్క్‌లు, డంపింగ్‌యార్డులను నిర్మించే బాధ్యతను సర్పంచులపై పెట్టారు. మురికి నీటి కాల్వలు, బురద ప్రాంతాల్లో చల్లే బ్లీచింగ్ పౌడర్ సంచులను కూడా పైనుంచి కొని పంపిస్తున్నారు. బస్తాల సంఖ్య ఆధారంగా కంపెనీకి చెక్కులు రాసి పంపించాలని సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. కంపెనీ ఏదైనా, క్వాలిటీ లేకపోయినా సర్పంచులు ఏం చేయలేని పరిస్థితి.