సర్కార్ కీలక నిర్ణయం.. పోస్టుమార్టం ఈ వేళల్లో కూడా చేయవచ్చు

by Anukaran |   ( Updated:2021-11-21 22:20:45.0  )
సర్కార్ కీలక నిర్ణయం.. పోస్టుమార్టం ఈ వేళల్లో కూడా చేయవచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాత్రి వేళల్లోను పోస్టు మార్టమ్​చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ విధానాన్ని అమలు చేసేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని డీఎంఈ డా రమేష్​రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 6 తర్వాత కూడా పోస్టు మార్టమ్​ చేయాలని ఆయా సూపరింటెండెంట్లను ఆదేశించారు. అంతేగాక రాత్రి సమయంలో చేసే ప్రతీ పోస్టు మార్టమ్​ విధానాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలని సూచించారు. రికార్డులలో సేఫ్​గా భద్రపరచాలన్నారు. అయితే మెడికో లీగల్ కేసులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట పోస్ట్‌మార్టమ్ నిర్వహించవద్దని సూచించారు.

సౌకర్యాలు నిల్​..

సాయంత్రం 6 తర్వాత కూడా పోస్టు మార్టమ్​చేయాలని సర్కార్​ సూచించినా, దానికి అనుగుణంగా స్టాఫ్​లేరని ఆసుపత్రి అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో పాటు సరైన మౌలిక వసతులు కూడా లేవని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి గాంధీ మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరే ఆసుపత్రిలోనూ పోస్ట్ మార్టమ్​ కొరకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో ప్రతీ రోజు ఎంతో మంది మృతదేహాల కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. సిబ్బంది, మౌలిక సౌకర్యాలు కొరతతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. వాస్తవానికి గాంధీ ఆసుపత్రిలో ప్రతీ ఏడాది సగటున 7 వేల వరకు పోస్టు మార్టమ్​లు జరుగుతాయి. ఇక్కడ ప్రస్తుతం ఫోరెనిక్స్ విభాగానికి చెందిన ఇద్దరు ప్రోఫెసర్లు, 2 అసోసియేట్​లు, 5 అసిస్టెంట్లు, నలుగురు పీజీలు పనిచేస్తున్నారు. కానీ డ్యూటీలకు మాత్రం కేవలం ఒక ప్రోఫెసర్​ మాత్రమే హజరవుతున్నారని సమాచారం. దీంతో మరో ప్రోఫెసర్​తో పాటు సిబ్బందిపై పనిభారం పడుతున్నదని చెబుతున్నారు. ఉస్మానియాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రాత్రివేళ్లలో పోస్టు మార్టమ్​ నిర్వహించేందుకు సరైన లైటింగ్ లేదు. దీంతో పాటు కోల్ట్​ స్టోరేజ్​లు, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది సమస్యఉన్నది. అంతేగాక పవర్​ జనరేటర్లు కూడా అవసరం. కావున వీటన్నింటిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయా ఆసుపత్రుల అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Advertisement

Next Story

Most Viewed