ఎమ్మెల్సీ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సర్దార్ రవీందర్ సింగ్

by Sridhar Babu |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సర్దార్ రవీందర్ సింగ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. మంగళవారం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్.. అధినేత కేసీఆర్ తన పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవితను ఎంపిక చేసే విషయంలో అధినేత కేసీఆర్ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయం మాదిరిగానే తన విషయంలో జరుగుతోందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ రవీందర్‌ సింగ్‌కు అధినేత మొగ్గు చూపుతారా అన్న చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ, తాజా ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న భాను ప్రసాదరావుపై వ్యతిరేకత బాహాటంగా ఉన్న విషయం అధిష్టానం దృష్టికి వెలుతుందని.. దీంతో చివరి నిమిషంలో ఆయనను తప్పించి తనకు అవకాశం కల్పిస్తారన్న ఆశలతో ఉన్నారు. అయితే రవీందర్ సింగ్ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నదే పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

రేపు సాయంత్రం వరకు..

అయితే రవీందర్ సింగ్ బుధవారం సాయంత్రం తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్క్రూటినీ తరువాత, అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నానని కూడా మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంటే ఆయన అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించకపోతే పోటీ నుండి తప్పుకుంటారా లేక బరిలో నిలుస్తారా అన్న విషయంపై స్పష్టత రానుంది. ఒక వేళ బరిలో ఉన్నట్టయితే రవీందర్ సింగ్ ఎలాంటి వ్యూహంతో ఓట్లు రాబట్టుకుంటారోనన్నది కూడా పజిల్ గానే మారింది.

ప్రతిపాదకులంతా ఇతర పార్టీ వారే

రవీందర్ సింగ్ నామినేషన్‌లో ప్రతిపాదించిన వారిలో ముగ్గురు కరీంనగర్‌కు చెందిన బీజేపీ వారు కాగా మరో ఇద్దరు స్వతంత్రులు, మిగతా ఐదుగురు రామగుండం ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆయన వ్యూహాత్మకంగా కరీంనగర్, రామగుండం కార్పోరేషన్లను కవర్ చేయడంతో పాటు ఎంపీటీసీలచే కూడా ప్రతిపాదన చేయించుకున్నట్టుగా అర్థం అవుతోంది. ఆయా ప్రాంతాలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారే కావడంతో పాటు వ్యక్తిగతంగా తనకు ఉన్న సీక్రెట్ ఓటు బ్యాంకు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కూడా లభిస్తుందని అనుకుంటున్నట్టుగా సమాచారం.

Advertisement

Next Story

Most Viewed