‘సాయిధరమ్ తేజ్‌’ పరిస్థితిని చూశారు కదా.. అయినా మీ తీరు మార్చుకోరా..?

by Shyam |   ( Updated:2021-09-11 09:52:42.0  )
‘సాయిధరమ్ తేజ్‌’ పరిస్థితిని చూశారు కదా.. అయినా మీ తీరు మార్చుకోరా..?
X

దిశ, కామారెడ్డి : సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదానికి అతివేగంతో పాటు రోడ్డుపై ఇసుక కుప్పలు ఉండటమే కారణమని మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అధికారులు రోడ్లపై ఉన్న ఇసుక కుప్పలు తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి గ్రామం వరకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు. అయితే, డివైడర్లకు ప్లాస్టరింగ్ చేయడం కోసం ఇటీవల రోడ్డుకు ఒకవైపు ఇసుక, కంకర కుప్పలు పోశారు. ప్లాస్టరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, రోడ్లపై ఇసుక, కంకరను కుప్పలుగా పోసిన అధికారులు పనులు పూర్తయ్యే వరకు ఆ రోడ్డును మూసివేయడం మరిచారు.

కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. పైగా ఈ రహదారిపై వందలాదిగా వాహనాలు రాత్రింబవళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలా వాహనాలు తిరగడం వల్ల కంకర, ఇసుక మొత్తం రోడ్డు మొత్తం పరుచుకుపోయాయి. దీంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఎవరైనా మట్టి కుప్పలు గమనించకుండా అతివేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. రోడ్డుపై పూర్తిగా పరుచుకుపోయిన ఇసుక, కంకరను ఒకేచోట కుప్పగా చేర్చడం కూడా చేయడం లేదు. ఇలాగే రోడ్డుపై ఇసుక, కంకర కుప్పలు ఉంచితే పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి కంకర, ఇసుక కుప్పలు తొలగించాలని, లేదంటే పనులు పూర్తయ్యే వరకు ఒకవైపు రోడ్డును మూసివేయాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed