- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్కార్ సాకు.. ప్రైవేట్ పంతుళ్లకు షాకు!
దిశ, తెలంగాణ బ్యూరో : “ శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే” కష్టాల్లో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు సర్కారు చేసే సాయంలో యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. అపత్కాల సాయాన్ని వేతనాల్లో నుంచి కోత పెట్టుతున్నారు. దాదాపు రెండేండ్ల నుంచి బడులు నడువక, ఆన్లైన్ క్లాసులు చెప్పుతున్నా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు యాజమాన్యం కిరికిరి పెడుతోంది. సర్కారు నుంచి తామే సాయం ఇప్పిస్తున్నామంటూ తాము చెల్లించాల్సిన వేతనాల నుంచి రూ. 2 వేలను కోత పెట్టుతున్నారు.
అందుకే మీకు వచ్చేలా చేశాం..
రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం రూ. 2వేల చొప్పున అపత్కాల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ప్రభుత్వ సాయం కొందరికే అందుతోంది. మొత్తం 2,06,345 దరఖాస్తులు వస్తే అందుటూ 1,24,704 మందికే సాయం దక్కింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ధృవీకరణ వచ్చిన తర్వాతే సాయాన్ని విడుదల చేశారు.
కాగా అపత్కాల సాయంలో ప్రైవేట్ యాజమాన్యాలు కొత్త దోపిడికి పాల్పడుతున్నాయి. తాము ధృవీకరించిన తర్వాతే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని, అందుకే నెలకు రూ. 2 వేల చొప్పున వేతనాల్లో నుంచి కట్ చేస్తున్నామని చెప్పి సగం జీతమే చేతుల్లో పెడుతున్నారు. మరోవైపు వాస్తవానికి ఇప్పుడు ఇచ్చే జీతాలు గత నెలలో ఇవ్వాల్సిన వేతనాలు. గత నెల నుంచి ప్రభుత్వ సాయం ఇవ్వలేదు. ఈ నెల నుంచే అమల్లోకి తీసుకువచ్చారు. గత నెల జీతాలను ఇప్పుడు అంతో, ఇంతో చెల్లిస్తున్న యాజమాన్యాలు వాటిలో కూడా కోత పెడుతున్నారు. ప్రతినెలా రూ. ఐదారు వేల వేతనాలు ఇస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం వాటిలో రూ. 2 వేలు కట్ చేసి ఇవ్వడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే ఇంతే తీసుకోవాలని చెప్పుతున్నారంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇచ్చిన వేతనాలను తీసుకుంటున్నారు.
ఆన్లైన్ క్లాసులు యథావిధిగానే..!
మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను యధాతథంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని పాఠశాలలైతే ఇంటి వద్ద నుంచి కాకుండా ఉపాధ్యాయులందరినీ స్కూల్కు రమ్మని, అక్కడి నుంచే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు ప్రతినెలా విద్యార్థుల నుంచి రూ. 8 వేలు వసూలు చేస్తున్నారు. కానీ పాఠాలు చెప్పే పంతుళ్లకు మాత్రం వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు చాలా యాజమాన్యాలు నాలుగైదు నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం గత నెలలో పాఠశాలలు తెరిచి ఒకేసారి వేల రూపాయల ఫీజులు తీసుకున్నా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి జీతాలు మాత్రం ఇవ్వడం లేదు.
ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని వేతనాలకు లింక్ చేస్తూ ఇచ్చే వేతనాల్లో రూ. 2 వేలను తగ్గిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫిర్యాదులు వచ్చే జిల్లాల అధికారులతో మాట్లాడుతున్నారు. దీంతో కొన్ని సంస్థలు మళ్లీ ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నా… మరికొన్ని సంస్థలు తిరిగి చెల్లించమని, వచ్చేనెల వేతనాల్లో కూడా కోత పెడుతామని చెప్పుతున్నాయి.
స్కూళ్ల గుర్తింపు రద్దు చేపిస్తాం : షబ్బీర్ అలీ, టీపీటీఎఫ్ అధ్యక్షుడు
పలు జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇలా ప్రభుత్వ సాయాన్ని వేతనాల్లో చూపిస్తూ కోత పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నాం. సర్కారు సాయాన్ని వారి వేతనాల్లో చూపించడం దారుణం. ఇప్పటికీ కూడా కొన్ని యాజమాన్యాలు అదేవిధంగా చేస్తున్నాయి. దీనిపై మాకు చెప్తే కలెక్టర్లతో మాట్లాడి అవసరమైతే స్కూళ్ల గుర్తింపును రద్దు చేపిస్తాం.