- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ ఉపఎన్నిక: ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతున్న ఎంఎస్పీ
దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్జునసాగర్‌లో ప్రధాన పక్షాలకు మహాజన సోషలిస్టు పార్టీ బెంగ పట్టుకుంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ పెట్టిన ఎంఎస్పీ ఈసారి సాగర్‌లో పోటీ చేస్తోంది. చివరి రోజు ఎంఎస్పీ తరపున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో ఎవరో ఒకరిని ఎంఎస్పీ నుంచి బరి నిలిపే అవకాశం ఉంది. సాగర్‌లో ప్రధాన పార్టీలు కుల సమీకరణాల ఆధారంగానే ముందుకెళ్లాయి.
సెగ్మెంట్‌లో మొత్తం 2,19,745 ఓట్లున్నాయి. ఇందులో 40 వేల ఓట్లు గిరిజనులవే. 35వేల ఓట్లు యాదవ కమ్యూనిటివి. ఓసీల ఓట్లు 31వేలు ఉండగా ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లే అధికం. గిరిజన ఓట్ల తర్వాత అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లున్నాయి. ఇందులో ఒక్క మాదిగ కమ్యూనిటీకి చెందిన ఓట్లే దాదాపు 25-27 వేల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే ఓట్లు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న యాదవ్, రెడ్డి, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు భగత్, జానారెడ్డి, రవినాయక్‌లను ప్రధాన పక్షాలు బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు అభ్యర్థులు ఆయా కమ్యూనిటీల్లో మెజార్టీ ఓట్లు సంపాదించవచ్చనే చర్చ జరుగుతోంది.
అయితే గిరిజన, యాదవ, రెడ్డి సామాజిక వర్గాల మెజార్టీ ఓట్లు వారి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు పడ్డా.. సెగ్మెంట్‌లో 25-27 వేల ఓట్లున్న మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎటు పడతాయోననే ఆందోళన ప్రధాన పార్టీలను వెంటాడుతుంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన సోషలిస్టు పార్టీ ఫౌండర్ మందకృష్ణ.. సాగర్ బరిలో తన అభ్యర్థులతో నామినేషన్స్ వేయించడంతో ఈ కమ్యూనిటీ ఓట్లు ఎక్కడ చీలిపోతాయోననే టెన్షన్ వారిలో నెలకొంది. 2014లో మహాజన సోషలిస్టు పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసిన జానకీరామ చౌదరికి దాదాపు 4వేల ఓట్లు వచ్చాయి. ఇందులో మెజార్టీ ఓట్లు మాదిగ సామాజిక వర్గం నుంచే ఆ పార్టీ సంపాదించగల్గింది.
అయితే, అప్పట్లో పార్టీ గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం తమకు మైనస్‌గా మారిందనే భావన నాయకత్వంలో ఉంది. కానీ, ఈ సారి ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి తమ కమ్యూనిటీలోకి చొచ్చుకెళ్లాలని మందకృష్ణ భావిస్తోన్నారు. ఇప్పుడు ఇదే అంశం ప్రధాన పార్టీల అభ్యర్థులకు కంటగింపుగా మారుతోంది. తమకు రావాల్సిన మాదిగ సామాజిక వర్గాల ఓట్లను ఎక్కడ ఎంఎస్పీ గండికొడుతుందోనని గాబర పడుతున్నారు. ఒకవేళ పోటీ హోరాహోరీ ఉంటే ఈ సామాజిక వర్గం నుంచే వచ్చే కొద్దిపాటి ఓట్లైనా.. గెలుపును శాసించవచ్చని భావిస్తున్నారు. అందుకే మండలాలు, గ్రామాల వారిగా మాదిగ సామాజిక వర్గాల ఓట్లపై ప్రధాన పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.