‘కాళ్ల’తో క్యారమ్స్.. సచిన్ ట్వీట్ వైరల్!

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-27 04:04:39.0  )
carroms-with-legs
X

దిశ, ఫీచర్స్ : చేతిగీతలు, తలరాతలు కాదు సంకల్పంతో విధిని సైతం ఎదురించి ముందుకు సాగుతానంటున్నాడు హర్షద్ గోతంకర్. రెండు చేతులు కోల్పోయిన ఈ యువకుడు కాళ్లతోనే తన పనులన్నీ చేసుకుంటూ, క్యారమ్స్‌లోనూ అదరగొడుతున్నాడు. ఈ మేరకు స్ట్రైకర్ అందుకుని బోర్డ్ ఫినిష్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న హర్షద్ వీడియోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. దాంతో అతడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకేస్తే.. ‘వైకల్యం’ విజయ మార్గంలో అడ్డుపడేంత పెద్దది కాదని నిరూపిస్తున్నాడు హర్షద్. తనకే ఎందుకిలా జరిగిందని బాధపడుతూ కూర్చోలేదు. చేతులు లేకపోతేనేం, కాళ్లు ఉన్నాయి కదా అని తనకు తాను ధైర్యాన్ని ప్రోది చేసుకుని తొలిగా ఫుట్‌బాల్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఆట సమయంలో సమతుల్యతను కాపాడుకోవడంలో విఫలమవడంతో కష్టమని భావించి వదిలేశాడు. ఆ సమయంలోనే ఓ స్నేహితుడు క్యారమ్ నేర్చుకోమని ప్రోత్సహించాడు. అలా తన పాదాలతోనే క్యారమ్ ఆడటంలో ప్రావీణ్యం పొందాడు.

‘పాజిబుల్, ఇంపాజిబుల్ మధ్య వ్యత్యాసం ఒకరి సంకల్పంలో ఉంటుంది. హర్షద్ తన పట్టుదలతో ఇంపాజిబుల్‌ను ఐ-ఎమ్-పాజిబుల్‌గా మార్చేశాడు. అతడి మోటివేషన్ లక్ష్యాన్ని అందుకోవడానికి సాధ్యమయ్యే మార్గాన్ని అందించింది. మనం అతని నుండి నేర్చుకోవచ్చు’ అంటూ సచిన్ టెండూల్కర్ తన వీడియోను పంచుకున్నాడు.

‘అద్భుతం. ప్రతిభ మాత్రమే ‘ఎక్స్‌ట్రార్డినరీ’ సృష్టించలేదనే దానికి ఇది రుజువు. అసాధారణంగా ఉండటానికి, సాధన రూపంలో స్థిరమైన కృషి, తనను తాను మెరుగుపరుచుకోవాలనే కోరిక చాలా అవసరం’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యనించాడు.

Advertisement

Next Story