వచ్చేఎన్నికల్లో బాబు ఉండకూడదని కుట్ర: సబ్బం హరి

by srinivas |
వచ్చేఎన్నికల్లో బాబు ఉండకూడదని కుట్ర: సబ్బం హరి
X

దిశ వెబ్‌డెస్క్: విశాఖ మేయర్‌గా, ఎంపీగా సబ్బం హరికి ప్రత్యేకమైన పేరుంది.. సబ్బం హరి చేసే విశ్లేషణలపై రాజకీయ వర్గాల్లో విశ్వాసం ఉంది. సబ్బం హరి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు.

వైజాగ్‌లో ఒక ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణాలు ప్రశాంతమైన జిల్లాలని అన్నారు. ఈ మూడు జిల్లాల్లోని ఎంపీలు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని ఆయన తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పిచ్చి ప్రేలాపనలతో హడావుడి చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్లంతా సంస్కారవంతంగానే ఉన్నారని సబ్బం హరి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబునే లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.

చంద్రబాబు నాయుడే తన శత్రువు అని భావిస్తున్న జగన్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు కనబడకూడదని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ ఎయిర్ పోర్టు‌లో చోటుచేసుకున్న ఘటనలో కొందరు పోలీసులను గూండాలుగా వాడుకున్నట్టు అనిపించిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు యూనిఫాం లేకుండా విధులకు వచ్చారని, మరికొందరికి నేమ్ ప్లేట్స్ కూడా లేవని ఆయన ఆరోపించారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాభివృద్ధి, రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు, విశాఖపట్టణం అభివృద్ధి గురించి, తరలిపోతున్న పరిశ్రమలను ఎలా ఆపాలన్న దానిపై ఆలోచన చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. దివంగత రాజశేఖరరెడ్డిలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed