- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు వాయిదా..! ఎప్పటిదాకా అంటే..?
దిశ, న్యూస్‌బ్యూరో: సర్కారు పంట పెట్టుబడి సాయంపై సందిగ్థం నెలకొంది. చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రైతుబంధు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ రైతుల వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తోంది. గ్రామాల వారీగా రైతుల వివరాలు, భూములను నమోదు చేస్తున్నారు. నియంత్రిత సాగు విధానంపై ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఎటూ తేల్చలేకపోతున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే వ్యవసాయ శాఖ ఇప్పుడు నమోదు చేస్తున్న రికార్డుల ప్రకారం రైతుబంధు వేస్తారా.. లేకుంటే సీఎం ప్రకటించిన విధంగా నియంత్రిత సాగు లెక్కలు తేల్చిన తర్వాత జమ చేస్తారా అనేది వ్యవసాయ శాఖ చెప్పలేకపోతోంది. క్షేత్రస్థాయిలో పంటల లెక్కలు తేల్చాలంటే దాదాపు రెండు నెలలకుపైగా పడుతుందంటున్నారు.
కొత్త రైతులకు అవకాశం..
కొత్త రైతుల నుంచి రైతుబంధు కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్తగా గత ఏడాది జూన్ 10 తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయిన రైతులకు ఈ వానాకాలంలో మంజూరు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీనికోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. స్వీకరించిన దరఖాస్తులపై ఈ నెల 13 నుంచి విచారణ చేసి వెంటనే పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. రైతుబంధు, దరఖాస్తు ఫారం, కొత్త పట్టదారు పాసు పుస్తకం. పట్టాదారుని ఆధార్ కార్డు, పట్టాదారుని బ్యాంకు ఖాతాల జిరాక్స్ తో దరఖాస్తు చేయాలని సూచించారు.
2.41 లక్షల మంది ఆధార్ సమస్య..
ఆధార్ అనుసంధానం ఉంటేనే రైతుబంధు వర్తింప చేస్తున్నారు. అయితే వివిధ కారణాలతో ఆధార్ అనుసంధానం కాని రైతులకు రైతుబంధు జమ కావడంలేదు. వీరి సొమ్ము బ్యాంకుల్లోనే ఉంటుంది. రాష్ట్రంలో 2.41 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదు. దీనిపై ఇప్పటికే రైతులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం రుణమాఫీ నేపథ్యంలో కూడా ఆధార్ ఖచ్చితంగా అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లు రైతులకు చెప్పుతున్నారు.
18.45 లక్షల పట్టాదారులకు రైతుబంధు బ్రేక్..
గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుబంధు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుతున్నా ఇప్పటిదాకా 18.45 లక్షల మంది పట్టాదార్లకు రైతుబంధు నిధులు జమ కావడంలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ లెక్కలు బయటకు వచ్చాయి. 2018 ఖరీఫ్‌లో 1.30 కోట్ల ఎకరాల్లో 50.25 లక్షల మందికి విడుదల చేశారు. 2018-19 ఖరీఫ్‌లో 1.40 కోట్ల ఎకరాల్లో 54.53 లక్షల మంది పట్టాదారులు ఉండగా, 49.10 లక్షల మంది బ్యాంకు వివరాలను సమర్పించారని లెక్కల్లో తేల్చారు. బ్యాంకు ఖాతాలు సమర్పించిన 1.31 కోట్ల ఎకరాల్లోని 49.03 లక్షల మందికి నగదు బదిలీ చేశారు. ఈ విడుతలో బ్యాంకు ఖాతాలు సమర్పించిన 7 వేల మంది రైతుబంధు అందలేదు. పలు సాంకేతిక సమస్యలతో 5.43 లక్షల మంది, బ్యాంకు ఖాతాలు సమర్పించినా 7 వేల మందికి పెట్టుబడి సాయం ఆగింది.
2019 ఖరీఫ్‌లో 1.45 కోట్ల ఎకరాల్లో 56.76 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరిలో 52.95 లక్షల మంది బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి వారి నిధులు మంజూరు చేశారు. వీరిలో 50.98 లక్షల మందికి రూ.6042 కోట్లను చెల్లించారు. బ్యాంకు ఖాతాల సక్రమంగా లేని వారు 3.81 లక్షల మంది, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా కూడా జమ కానివారు 1.97 లక్షల మందితో కలుపుకుని మొత్తం 5.78 లక్షల మందికి ఈసారి రైతుబంధు అందలేదు. 2019-20 రబీలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల్లో 47.50 లక్షల మంది అర్హులుగా గుర్తించగా బ్యాంకు ఖాతాలను ట్రెజరీలో జమ చేసిన రైతులు 42.42 లక్షలుగా పేర్కొన్నారు. అంటే 5.08 లక్షల మంది ఖాతాలు సరితూగలేదు. మిగిలిన 42.42 లక్షల మందిలో 40.26 లక్షల మందికి రూ.3925 కోట్లు జమ చేశారు. బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్న వారిలో కూడా 2.16 లక్షల మందికి గత రబీలో పెట్టుబడి సాయం రాలేదు.
చేతులు మారిన భూమికి కూడా రాలే..
2018 ఖరీఫ్ నుంచి మొదలైన రైతుబంధు పథకంలో ముందు నుంచీ జాబితాలో ఉన్నవారిలో ఎంతో కొంత మందికి ఇస్తున్నారు. అయితే ఆ తర్వాత భూ అమ్మకాలు చేసి, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రైతుబంధు రావడం లేదు. వారికి వెబ్‌సైట్‌లో ఆమోదం వస్తున్నా రైతుబంధు సొమ్ము మాత్రం జమ కావడం లేదు. వేలాది ఎకరాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తేలింది.
ఇప్పుడు ఎప్పుడిస్తరు..?
ఈ వానాకాలం రైతుబంధుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయ శాఖకు కూడా దీనిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు కేవలం రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామాల్లో రైతుల పేర్లు, ఎంత భూమి ఉందనే వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తున్నట్లు చెబుతున్నారు. క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలి, నియంత్రిత సాగు విధానంపై ఎలాంటి వివరాలు సేకరించడం లేదు. సీఎం కేసీఆర్ దీనిపై మీడియాలో ప్రకటన చేయడం తప్ప ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో ఆందోళన పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ గతంలో మాదిరిగానే ముందుగానే రైతుల ఖాతాల్లో వేసే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. నియంత్రిత సాగు విధానంలో చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు వస్తుందని స్పష్టమైన ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పక్షాన ఎలాంటి సమాచారం లేదు.
ప్రస్తుతం రైతుల వివరాలన్నీ నమోదు చేయడం మరో పది రోజుల్లో పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ గ్రామాలకు వెళ్లడం, వేయాల్సిన పంటలపై చెప్పడం, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం కోసం చాలా రోజులు పడుతుందని పేర్కొంటున్నారు. జిల్లాల వారీగా వేయాల్సిన పంటలను ప్రాథమికంగా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ ఇంకా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో నియంత్రిత సాగు విధానంపై అస్పష్టత నెలకొంది. రాష్ట్రంలో ఈ వానాకాలం మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక చేయగా 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. 41 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాల్సి ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. అపరాలు, కూరగాయలు మొత్తం కలుపుకుని 1.25 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తారని వెల్లడించారు. వరి సాగులో 60 శాతం దొడ్డు రకాలు, 40 శాతం సన్నరకాలు వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్నిచోట్ల సన్నాల సాగుకు రైతులు ఇప్పటి నుంచే వ్యతిరేకిస్తూ అభిప్రాయాన్నిచెప్పుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రైతుబంధు వివరాలు..
సీజన్ పట్టాదారు రైతులు(లక్షలు) సొమ్ము(కోట్లు) ఎకరాలు(లక్షలు) రైతు బంధు రాని రైతులు
ఖరీఫ్ -2018 50.15 5236.42 130.91 —
రబీ 2018-19 54.53 5631.42 140.79 5.43 లక్షలు
ఖరీఫ్ -2019 56.76 7254.33 145.09 5.78 లక్షలు
రబీ 2019-20 47.50 6155.72 123.11 7.24