నాడు పట్టణాలు.. నేడు పల్లెలు.. కంటైన్మెంట్లు జోన్స్‌గా రూరల్ ఏరియాలు

by Sridhar Babu |   ( Updated:2021-06-05 23:06:32.0  )
నాడు పట్టణాలు.. నేడు పల్లెలు.. కంటైన్మెంట్లు జోన్స్‌గా రూరల్ ఏరియాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పట్టణ ప్రాంత వాసులను కలవరపెట్టిన కరోనా గ్రామీణ ప్రాంత ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టేస్తోంది. దీంతో ఇంతకాలం సేఫ్‌గా ఉన్నాయనుకున్న పల్లెల్లో నేడు కరోనా విలయతాండం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా బాధితులు వెలుగులోకి వచ్చిన వెంటనే.. అధికారులు చకాచకా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని చాలా పట్టణాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫస్ట్ వేవ్ సమయంలో పల్లెల్లో జనం స్వీయ నిర్బంధం విధించుకున్నారనే చెప్పాలి. గ్రామాల నుంచి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమై ఉన్న పరిస్థితి నాటిది. అయితే ఇప్పుడా పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. స్వచ్ఛమైన గాలి లభ్యమయ్యే అటవీ ప్రాంత పల్లెల్లో కూడా కరోనా విలయతాండవం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

కంటైన్మెంట్ జోన్లు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి గమనిస్తే కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. ఎక్కువగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సబ్ డివిజన్‌లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కాటారం మండలంలోని పలు గ్రామాల్లో నెల రోజుల క్రితమే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా మహదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం, మండల కేంద్రమైన మహాదేవపూర్‌తో పాటు పలు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఐసోలేషన్ కేంద్రాలు..

ఇకపోతే కరోనా మహమ్మారి విజృంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేస్తే.. ఈ సారి కొవిడ్ బాధితుల కోసం క్వారంటైన్ సెంటర్లను నెలకొల్పారు. మహాముత్తారం మండలం యత్నారం గ్రామంలో 34 మంది బాధితులను అధికారులు గుర్తించారు. దీంతో వారంతా సమీపంలోని అడవుల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మహదేవపూర్, కాళేశ్వరం, సురారం గ్రామాల్లో కూడా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిరుడు పట్టణ ప్రాంత వాసులను కలవరపెట్టిన కరోనా.. సెకండ్ వేవ్ మాత్రం పల్లె జనాలను కూడా ఆందోళనకు గురిచేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed