అధికారుల వేధింపులు తాళలేక RTC డ్రైవర్ ఆత్మహత్య

by Sumithra |
RTC driver Tirupati reddy
X

దిశ, బేగంపేట: విధులకు గైర్హాజరు అయ్యాడన్న కారణంతో విధులకు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేయడంతో ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామ్‌‌గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. తోటి ఆర్టీసీ కార్మికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి(52) రాణిగంజ్ ఆర్టీసీ-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాపిల్లలను వదిలేసి విధులు నిర్వహించి, గతకొంత కాలంగా డిపోలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మెడికల్ లీవ్‌లు తీసుకున్నాడు. 23, 24వ తేదీల్లో సైతం అధికారులకు సమచారం ఇవ్వకుండా లీవ్‌ తీసుకున్నాడు. 25వ తేదీన డ్యూటీకి వెళ్లాడు. దీంతో రెండ్రోజులు సమాచారం ఇవ్వకుండా లీవ్ తీసుకోవడంతో అధికారులు తిరుపతిరెడ్డికి 25వ తేదీ నుంచి డ్యూటీలు వేయడం లేదు.

డిపో మేనేజర్‌ను కలువాలని ఆర్టీసీ సీఐ విజయ్‌కుమార్ తిరుపతిరెడ్డికి సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతిరెడ్డి.. తాను ఏ తప్పు చేయలేదని, డిపో మేనేజర్‌ను ఎందుకు కలువాలని ప్రశ్నించాడు. మళ్లీ ఇవాళ(మంగళవారం) కూడా డిపోకు వెళ్లి డ్యూటీ వేయండి అని అడిగాడు. విజయ్ కుమార్ మళ్లీ మేనేజర్‌ను కలువాలని చెప్పడంతో ఉదయం 6 : 30 ప్రాంతంలో కంట్రోల్ కార్యాలయం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి డ్రైవర్స్ తిరుపతిరెడ్డిని హుటాహుటిన స్థానిక ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అప్పటికే తిరుపతిరెడ్డి మరణించాడని తెలిపారు. తిరుపతిరెడ్డి కుమారుడు అనంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

అధికారుల వేధింపులే కారణం..

ఆర్టీసీ సీఐ విజయ్ కుమార్, ఆర్టీఐ రామ్ రెడ్డి, కంట్రోలర్ జి.ఆర్ రెడ్డిలే తిరుపతి రెడ్డి మరణానికి కారణం పలువురు ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఐదు నిమిషాలు ఆలస్యం జరిగినా.. ఆరోజు కంట్రోలర్ విధులు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గైర్హాజరు పేర్లతో ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ కార్మికుల పట్ల కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి రెడ్డి మరణానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed