కాళేశ్వరం నీళ్లు దేనికి.. వరి కోసం కదా? : RS ప్రవీణ్ కుమార్

by Sridhar Babu |
కాళేశ్వరం నీళ్లు దేనికి.. వరి కోసం కదా? : RS ప్రవీణ్ కుమార్
X

దిశ, హుజురాబాద్ : వరి ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని బీఎస్పీ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో దళిత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. ధర్నా చౌక్ ఎత్తేసిన టీఆర్ఎస్ ప్రభుత్వమే అదే చోట ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. నల్ల చట్టాలు తీసుకువచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిదీయలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నీళ్లతో రైతులు వరి పండిస్తారని తెలియదా? అని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణాలో కోటి ఎకరాల మాగాణి అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం.. నేడు వడ్లు కొనమని కేంద్రం పై నెపాన్ని నెట్టివేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు విషయంలో దోబూచులాడుతున్నాయిన్నారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు ఇప్పటివరకు దుస్తులు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని అయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed