ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్.. టీఆర్ఎస్‌లో అంతర్మథనం

by Anukaran |   ( Updated:2021-08-09 22:29:54.0  )
RS Praveen Kumar, TRS
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన నల్లగొండ సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరుకావడంపై టీఆర్ఎస్ పార్టీలో చర్చ మొదలైంది. కొత్త పథకంతో దళితులంతా టీఆర్ఎస్ వైపు నిలబడతారని భావించినప్పటికీ దళిత యువత ఉత్సాహంగా నల్లగొండ సభకు హాజరుకావడం దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది. భారీ ఖర్చుతో పథకాన్ని రూపొందించినా, ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినా ప్రవీణ్ కుమార్‌ వైపు మొగ్గు చూపడంపై విశ్లేషణలు మొదలయ్యాయి. సమీప భవిష్యత్తులో దళిత ఓటు బ్యాంకు విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అనే తీరులో ఆలోచించాల్సి వస్తుందేమో అనే అభిప్రాయాన్ని ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.

పథకాన్ని స్వాగతిస్తూనే ప్రవీణ్ కుమార్ సభకు ఎందుకు వెళ్లారు.. అలా వెళ్లినవారెవరు? లాంటి అంశాలపై చర్చ జరుగుతున్నది. నిరుద్యోగులా? విద్యాధికులా? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత? లేదా అసంతృప్తి ఉన్నవారా..? ఇలా అనేక కోణాల్లో విశ్లేషణ మొదలైంది. దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టినా అనూహ్యంగా నల్లగొండ సభకు భారీ స్థాయిలో హాజరుకావడం టీఆర్ఎస్‌ను సందేహాల్లో ముంచెత్తింది. సీఎం దత్తత గ్రామమైన వాసాల మర్రిలో 76 మంది దళితులకు 7.6 కోట్లు మంజూరు చేసింది కళ్లముందు కనిపిస్తున్నా ఆ సభకు కేవలం దళితులే హాజరుకావడం టీఆర్ఎస్‌ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు ఎంత మంది హాజరయ్యారనే దానికంటే అది జరిగిన తీరు, వారిలో కనిపించిన ఉత్సాహాన్ని టీఆర్ఎస్ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ పథకాన్ని ఈనెల 16న లాంఛనంగా ప్రారంభించే సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఒక వ్యక్తిగా అతి తక్కువ వ్యవధిలోనే ఈ సభకు ఏర్పాట్లు చేయడం, కేవలం పార్టీలో చేరే కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం, ఎలాంటి పార్టీ నిర్మాణం లేకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని ఆర్గనైజ్ చేయడం లాంటి అంశాలన్నింటినీ గమనించిన ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దళితులంతా టీఆర్ఎస్ పక్షాన ఉంటారని భావిస్తున్న సమయంలో అంచనాలకు భిన్నంగా ప్రవీణ్ కుమార్ సభకు హాజరుకావడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. ఇకపైన పగడ్బందీగా వ్యవహరించడంపై దృష్టి పెట్టనున్నది. అధికార పార్టీ నేతలు ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నారు.

ఏ పథకానికి రూపకల్పన చేసినా ముందుగా గ్రౌండ్ వర్క్ చేసి నిశిత అధ్యయనంతో ప్లాన్ చేస్తుందనేది టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రత్యేక గుర్తింపు. ఆ పథకం అమలు సాధ్యాసాధ్యాలను బేరీజు వేయడంలో కూడా కేసీఆర్ దిట్ట అని ఆ పార్టీ నేతలు ఒకింత గర్వంగానే చెప్పుకుంటుంటారు. పథకం గురించిన ఆలోచన రావడంతోనే దళిత సంఘాల ప్రతినిధులతో, మేధావులతో స్వయంగా సీఎం చర్చించి వారి అభిప్రాయాలను మదింపు వేసి వాసాలమర్రి గ్రామ సభలో ప్రజలకు అర్థమయ్యే తీరులో వివరించారు. దళితులు ప్రశంసలు కురిపించినా ప్రవీణ్ కుమార్ సభకు హాజరు కావడం వెనక టీఆర్ఎస్ పట్ల పూర్తి విశ్వాసంతో లేకపోవడమే కారణమా? లేక ఇంకేమైనా అనే తీరులో అధ్యయనం జరుగుతుంది.

దీనికి తగినట్లుగా హుజూరాబాద్‌లో లాంఛనంగా ఈ నెల 16న పథకం ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఉండనున్నదని ఆ పార్టీ నేతల భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేయడం, పంచ్‌లు విసరడం ద్వారా అధికార పార్టీకే సవాలు విసిరారని, దీనికి సీఎం ఘాటుగానే సమాధానం చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. దళిత ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని పార్టీ ఇప్పుడు మరింతగా గుర్తిస్తున్నదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ లేవనెత్తిన అంశాలను కేసీఆర్ తనదైన శైలిలో హుజూరాబాద్ వేదికగానే తిప్పికొడతారన్నారు.

Advertisement

Next Story