భారీ పతనానికి రూ. 11 లక్షల కోట్లు మాయం!

by Harish |
భారీ పతనానికి రూ. 11 లక్షల కోట్లు మాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తితో స్టాక్ మార్కెట్లు గురువారం భారీ పతనాలను నమోదు చేశాయి. సోమవారం నాటి నష్టాలనుంచి బుధవారం కాస్త కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ గురువారం అంతకుమించి నష్టాలు మార్కెట్లకు తప్పలేదు. ఒకవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించడం, మరోవైపు యూరప్ దేశాల నుంచి అమెరికాకు పర్యాటకుల నిషేధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించాయి. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగింది. కరోనా వైరస్ ధాటికి తోడు ట్రావెల్ బ్యాన్ వల్ల మార్కెట్లలో సెంటిమెంట్ భారీగా దెబ్బతింది. మదుపర్లు అత్యధికంగా అమ్మకాలకు తెగబడ్డారు. స్టాక్ మార్కెట్లు చరిత్రలో లేనంత నష్టాన్ని మూటగట్టండంతో మదుపర్లకు గురువారం ఒక్కరోజే రూ. 11 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. భారీ పతనానికి నిఫ్టీ బేర్ మార్కెట్లోకి వెళ్లింది.

కరోనా వైరస్ మార్కెట్ల సెంటిమెంట్‌ను ఆధిపత్యం చేస్తుందనే భయంతో సెన్సెక్స్, నిఫ్టీ అమ్మకాల ఒత్తిడితో విలవిల్లాడాయి. ఇంట్రాడేలో ఒక్కరోజే 8.7 శాతం పడిపోయింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం పెరుగుతుందనే భయాల మధ్య మదుపర్లలో ఆందోళన పెరిగింది. దీంతో మార్కెట్లకు భారీ నష్టం తప్పలేదు. సాధారణంగా మార్కెట్లు పతనమయ్యే సమయంలో మదుపర్లు ప్రత్యామ్నాయంగా బంగారంపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వేగంగా వ్యాపిస్తున్న కరోనా ధాటికి బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. దీంతో మదుపర్లలో భయం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, భవిష్యత్తులో బంగారం, చమురు ధరలు మళ్లీ పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tags: sensex, nifty, stock market, market loss, Sensex Crash, Market Crash, Nifty50, Coronavirus

Advertisement

Next Story

Most Viewed