చదువు చెప్తానని ఏనాడూ ఊహించలేదు..

by Sridhar Babu |
చదువు చెప్తానని ఏనాడూ ఊహించలేదు..
X

దిశ, కరీంనగర్: సాధారణంగా మ్యారేజ్ తర్వాత యువతులు తమ లక్ష్యాలను పక్కన పెడుతుంటారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ లైఫ్‌లో కాంప్రమైజ్ అవుతుంటారు. తమకేదైనా ఆలోచన వచ్చినప్పటికీ కొందరు కనీసం దాన్ని షేర్ చేసేందుకు కూడా ఇష్టపడరు. ఎందుకంటే భర్త, కుటుంబం నుంచి స్పందన ఎలా ఉంటుందోనన్న డౌట్. అటువంటి డౌట్ లేవీ పెట్టుకోకుండా పెళ్లి అయిన తర్వాత కొన్ని ఏళ్లకు తనకు చదువుకోవాలని ఉందన్న ఆలోచనను భర్తకు చెప్పింది ఓ మహిళ. భర్త ప్రోత్సాహంతో పిల్లలతో కలిసి తను ఓ విద్యార్థిగా మారింది. డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఉన్నత చదువులు చదివింది. పదేళ్ల పాటు సాగిన చదువుల తర్వాత పోటీ పరీక్షలు రాసింది. రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రస్తుతం విద్యార్థులకు పాఠాలు చెప్తోన్నది. ఆమే రౌతు పద్మ. మ్యారేజ్ తర్వాత చదువులకు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదనీ, కష్టపడి చదివితే తాము అనుకున్నది సాధించొచ్చని చెబుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోందామె. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఒకే సారి నాలుగు ఉద్యోగాలు..

మంథని సమీపంలోని చల్లపల్లికి చెందిన పద్మ తండ్రి సింగరేణి ఉద్యోగి. పద్మ గోదావరిఖనిలోనే హైస్కూల్ వరకు చదువుకున్నారు. 1995లో ముత్తారం మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన రౌతు రమేష్‌‌తో వివాహం జరిగింది. పదోతరగతి చదువుతున్న క్రమంలో పెళ్లి అయింది. భర్త రమేష్‌కు ఉద్యోగం రావడంతో భార్యాభర్తలిద్దరూ 8 ఇంక్లైన్ కాలనీకి షిఫ్ట్ అయ్యారు. ఇద్దరు పిల్లల తల్లిగా, హౌజ్ వైఫ్‌గా బీజీగా లైఫ్ గడుపుతున్నారు. పిల్లలు ఆరో తరగతికి చేరుకున్నప్పుడు పద్మలో ఆలోచనల సంఘర్షణ మొదలైంది. తాను కూడా చదువుకుంటే ఎలా ఉంటుందన్నది ఆమెకొచ్చిన థాట్. ఈ విషయాన్ని తన భర్తతో పంచుకున్న వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. అంతే కాకతీయ యూనివర్శిటీ దూరవిద్యలో జాయిన్ అయింది. డిగ్రీ పట్టా పొందిన తర్వాత బీఎడ్, ఎంఈడీ చేశారు. 2007లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పద్మ 2017 వరకు పదేళ్ల పాటు చదువుతూనే ఉన్నారు. 2018లో ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యారు. అందులో బెటర్ ఆప్షన్‌గా గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. 2018 సెప్టెంబర్‌లో ఆమె కుమార్తె అలేఖ్య పటేల్ కూడా ఫస్ట్ అటెమ్ట్‌లోనే సీడీపీవోగా జాబ్ సాధించారు. తల్లి పద్మ విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయితే తనయ అలేఖ్య సిరిసిల్లలోనే శిశు సంక్షేమ శాఖాధికారిణిగా పని చేస్తోన్నది.

భర్త, పిల్లల ప్రోత్సాహం..

కుటుంబ విధులు నిర్వర్తిస్తూ పద్మ పిల్లలను స్కూల్‌కు, భర్తను ఆఫీస్‌కు పంపిన తర్వాత తాను డిగ్రీ పుస్తకాలు ముందేసుకునేది. ఏదైనా డౌటొస్తే నోట్ చేసుకుని భర్త వచ్చిన తర్వాత క్లారిఫై చేసుకునేది. పిల్లలు చదువుపై పద్మకు ఉన్న శ్రద్ధను గ్రహించి వారే టైం టేబుల్ తయారు చేసి ఇచ్చారు. ఆ ప్రకారం పద్మ ఫాలో అయ్యేది. అయితే, ఇరుగు పొరుగు వారితో కలిసి మెలిసి ఉండేందుకూ సమయం కేటాయించేది. అలా తన చదువులు కొనసాగించింది. ఇప్పుడు కూడా ఉద్యోగరీత్యా స్కూల్‌కు వెళ్తున్నప్పటికీ పిల్లలు, ఇరుగు పొరుగు వారితో తగిన టైం ఇస్తూ ముందుకు సాగుతోన్నది. పదో తరగతిలో తను బోధించే తెలుగులో విద్యార్థినీ విద్యార్థులకు 10 జీపీఏ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.

నా గురువు మా వారే: రౌతు పద్మ, తెలుగు ఉపాధ్యాయురాలు

పిల్లలు ఎదుగుతున్న సమయంలో నాకొచ్చిన ఆలోచనను మా వారు రమేష్‌తో షేర్ చేసుకున్నాను. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడం నాలో నూతనోత్తేజాన్ని నింపింది. అదే ఉత్సాహంతో ముందుకు సాగాను. పదేళ్ల పాటు అప్రతిహతంగా ఉన్నత చదువుల వైపు నా పయనం సాగింది. పిల్లలు కూడా నాకు గైడ్‌లా మారిపోయారు. నా చదువుకు ఆటంకం కలగకుండా నా యాక్షన్ ప్లాన్ తయారు చేసేవారు. ఓ వైపున మా వారు మరో వైపున నా బిడ్డలు నాకందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. వివాహం తర్వాత కుటుంబానికే పరిమితం అవుతానుకున్న నేను క్లాస్ రూముల్లో చాక్ పీస్‌తో చదువు చెప్తానని ఏనాడూ ఊహించలేదు. ఇందుకు నా మెట్టినింటి నుంచి అందిన ప్రోత్సాహం ఓ కారణమైతే మరో కారణం గాడ్ అని నేను భావిస్తున్నా.

Advertisement

Next Story

Most Viewed