రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

by Shyam |
రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, అటవీ అనుమతులు తదితర విషయాలపై చర్చించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిoచాలని ఆయన అధికారులను ఆదేశించారు. రహదారులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ, మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ విభాగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా కమిటీ ఈ సందర్భంగా చర్చించింది. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ శోభ , ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, రీజినల్ అఫీసర్ రవి ప్రకాష్, నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా అధికారి క్రిష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story