పెట్రోల్‌ సేవ్ కావాలంటే ఇలా చేయాలి

by Anukaran |   ( Updated:2020-08-30 02:02:36.0  )
పెట్రోల్‌ సేవ్ కావాలంటే ఇలా చేయాలి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాలుగా ఆ రహదారి నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. నత్త చూస్తే.. నవ్విపోదా అన్న చందంగా మారింది ఆ రహదారి పరిస్థితి. పేరుకు అది జాతీయ రహదారి. కానీ ఏండ్ల తరబడి దాని నిర్మాణంలో జాప్యం జరుగుతూనే వస్తోంది. పరిహారం కోసం రైతులు.. ప్రయాణం కోసం వాహనదారులు ఏండ్లుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. నల్లగొండ జిల్లాలో రహదారుల విస్తరణ అస్తవ్యస్తంగా తయారయ్యింది. అధికారుల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారుల చేతివాటం.. ఫలితంగా జాతీయ రహదారులు అసంపూర్తిగా మిగిలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం.. గుత్తేదారు సంస్థ నిర్లక్ష్యం.. నిధుల కొరత వెరసి నకిరేకల్ – నాగార్జున సాగర్ జాతీయ రహదారి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు ఈ రహదారిపై రాకపోకలు నరకాన్ని తలపిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాలిలోతు గోతులు.. గతుకులతో రహదారిపై ప్రయాణం అడుగొక గండం.. క్షణమొక నరకంగా మారింది.

ఐదేండ్లుగా అవే ఇబ్బందులు..

మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఏపీలోని రేణిగుంట వరకు జాతీయ రహదారి 565ను నిర్మిస్తున్నారు. ఇందులో నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు రూ.210 కోట్లతో రహదారిని విస్తరిస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నల్లగొండను తాకుతూ వెళ్లేలా రూ.86 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ పనులను ప్రభుత్వం 2014 మార్చిలో గుత్తేదారులకు అప్పగించారు. 2016 మార్చిలోపు ముగించాలని గడువు విధించింది. ఇంతవరకు 50 శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి.

నష్టపరిహారం చెల్లించకుండానే..

ప్రధానంగా నకిరేకల్ నుంచి నల్లగొండ మధ్య చేపట్టిన 23 కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులకు ఏండ్ల తరబడిగా గ్రహణం వీడడం లేదు. రహదారి విస్తరణలో భాగంగా నష్టపరిహారం చెల్లించకుండానే గుత్తేదారు సంస్థ పనులను మొదలుపెట్టింది. దీంతో నకిరేకల్ నుంచి నల్లగొండ మధ్యలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు పరిహారం కోసం కోర్టు మెట్లెక్కారు. ఫలితంగా గుత్తేదారు సంస్థ రోడ్డు విస్తరణ పనులను సైతం నిలిపేసింది. రైతుల భూములతో సంబంధం లేని ప్రదేశాల్లోనూ పనులు ఆపేసింది. చివరకు నకిరేకల్ మండలం తాటికల్ వద్ద వంతెన నిర్మాణాన్ని సైతం మధ్యలోనే వదిలేసింది. దాదాపు ఐదేండ్లుగా పనులు తిరిగి మొదలుపెట్టడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకుని సమస్యను పరిష్కరించాలి.

ప్రత్యక్ష నరకం కన్పిస్తోంది : పిట్టల వెంకటేశం, వాహనదారుడు

నా పేరు వెంకటేశ్. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. నిత్యం నకిరేకల్ నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తాను. నకిరేకల్ నుంచి నల్లగొండకు వెళ్లాలంటే.. కట్టంగూరు మీదుగా వెళితే.. ఐదారు కిలోమీటర్లు అదనంగా వస్తుంది. అందుకే తాటికల్ మీదుగా వెళుతుంటా. పెట్రోల్‌తో పాటు సమయంలో సేవ్ చేసుకునేందుకు ఆ దారి మీదుగా వెళ్లేందుకు ఇష్టపడతా. కానీ కొత్త రహదారి నిర్మాణం పేరుతో పాత రహదారిని తవ్వేశారు. ఐదేండ్లు దాటింది. ఇంతవరకు రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు.

Advertisement

Next Story