అక్కడ కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి

by Sumithra |
అక్కడ కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి.. అక్రమార్కుల చేతుల్లో ప్రకృతి సంపద నామరూపాల్లేకుండా పోతోంది.. ప్రభుత్వ, అసైన్డ్​భూములకు పట్టాలు సంపాదించుకున్న అక్రమార్కులు ప్రభుత్వ పెద్దల అండ, అధికారుల సహకారంతో ఇష్టారీతిన క్రషర్లు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా బ్లాస్టింగ్‌ చేస్తుండడంతో ఇళ్ల గోడలు బీటలువారుతున్నాయి. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోనే జరుగుతుండడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపం మాక్లూర్ గ్రామ శివారులో సర్వే నంబర్​914, 939 లో పెద్ద ఎత్తున విలువైన ప్రభుత్వ భూములున్నాయి. దీంతో అక్కడ ఇటీవల జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా ఇక్కడే నిర్మించారు. ప్రస్తుతం ఎఫ్ సీఐ గోదాంల నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే నిరుపేదలకు గుంట భూమి ఇవ్వని అధికారులు క్రషర్ నిర్వహణకు మాత్రం ప్రభుత్వ అసైన్డ్ భూమిని లీజుకి ఇచ్చారు. మాక్లూర్ తహసీల్దారు కార్యాలయం, పోలీస్​స్టేషన్ కి కూత వేటు దూరంలో దాదాపు రెండు దశాబ్దాలుగా లీజును పొడిగిస్తూ రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు వారి వ్యాపారానికి పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న గుట్టలను ధ్వంసం చేసి కంకరగా మార్చి రూ.కోట్లు గడిస్తున్నారు. మొదట నాలుగెకరాల విస్తీర్ణంలో ప్రారంభైన ఈ వ్యాపారం చుట్టుపక్కలకు విస్తరించింది.

నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు..

తెల్లవారింది మొదలు గుట్టలను ధ్వంసం చేస్తూ నిబంధనలకు విరుద్దంగా పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తూ బాంబుల మోత మోగిస్తున్నారు. అనుమతి గల వ్యక్తుల నుంచి మాత్రమే పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని, అనుభవం, నైపుణ్యం గల వ్యక్తులే పేలుళ్లు జరపాలి. అనుమతి ఇచ్చిన లోతులో మాత్రమే పేల్చాలనే తదితర నిబంధనలు ఉన్నా క్రషర్​నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇష్టారీతిన పేలుల్లు జరుపుతుండడంతో సమీప గ్రామాల్లో ఇల్లు బీటలు వారుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో బోర్లు కూలిపోతున్నాయి. పేలుడు జరిగే సమయంలో టీవీలు, వంట పాత్రలు పడిపోతున్నాయి. దీంతో జనం భయందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడూ ఏం జరుగుతుందోనని భయంతో కాలం వెల్లదీస్తున్నారు.

కనుమరుగవుతున్న ప్రకృతి సంపద

అక్రమ మైనింగ్​ వల్ల ప్రకృతి సంపద మొత్తం ధ్వంసమవుతోంది. గుట్టలు కరిగిపోతున్నాయి. పచ్చని చెట్లు నేలమట్టం అవుతున్నాయి. నిత్యం బాంబుల మోతతో మాక్లూర్ మండల పరిధి మాక్లూర్, మాదాపూర్, సింగంపల్లి, దుర్గానగర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. కాగా, క్రషర్ నిర్వాహకుడు అధికార పార్టికి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు సహకరిస్తున్నారని, దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురువుతోంది. మాక్లూర్ గ్రామానికి పశువుల మేత కోసం ఇచ్చిన స్థలంలో భారీ ఆనకట్ట కట్టి భూమిని కబ్జా చేశాడన్న ఆరోపనలున్నాయి. ఇదంతా ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో జరుగుతున్నా.. ఏ అధికారి స్పందించడం లేదు. దీంతో క్రషర్​నిర్వాహకుడు దశాబ్దంన్నర కాలంగా అక్రమ మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story