బిజినెస్ నిల్.. నష్టాల్లో రైస్ ట్రేడర్స్

by Shyam |   ( Updated:2021-06-17 11:45:26.0  )
బిజినెస్ నిల్.. నష్టాల్లో రైస్ ట్రేడర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కర్కశానికి దాదాపు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అదే కోవలో రైస్ ట్రేడర్స్ కూడా మునుపెన్నడూ చూడని భారీ నష్టాలను చవిచూశారు. కొవిడ్ కారణంగా హాస్టళ్లు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు, పలు కార్యాలయాలు మూతపడటంతో బ్యాచిలర్లు, ఉద్యోగులు వారి స్వగ్రామానికి పయనమయ్యారు. దీంతో హాస్టళ్లకు రెగ్యులర్‎గా బియ్యం సరఫరా చేసే వారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. కరోనాకు ముందు రోజుకు కనీసం 25కు పైగా బియ్యం బ్యాగులు విక్రయించే వారు నేడు కనీసం రెండు బ్యాగులు కూడా అమ్ముడవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు జరగక స్టాక్ మొత్తం షాపులోనే ఉందని, దీంతో కుటుంబ పోషణ భారమైందని నిర్వాహకులు అంటున్నారు.

కిరాణా సామగ్రి వైపునకు మొగ్గు

కరోనా వ్యాప్తి జరగక ముందు వరకు కేవలం రైస్ బ్యాగుల వల్ల జరిగే బిజినెస్‌కు సమయం సరిపోయేది కాదని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో షాపులో రైస్ బ్యాగులు తప్పా వేరే సామాగ్రి తీసుకువచ్చే వాళ్లం కాదని అంటున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని వారు వాపోతున్నారు. హాస్టళ్లు మూతపడటంతో బిజినెస్ పూర్తిగా కోల్పోవడంతో కిరాణా సామగ్రిని కూడా తెచ్చుకుని విక్రయాలు చేపడుతున్నారు. అలా అయినా కుటుంబ పోషణకు ఇబ్బందులు తప్పుతాయని భావించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా కిరాణా సామగ్రి అయితే ప్రతిరోజు ఎంతో కొంత బిజినెస్ జరిగి కొవిడ్ విజృంభణ తగ్గాక తమ షాపునకు కొంతైనా గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.

గతంలో నై.. ఇప్పుడు సై..

గతంలో మిల్లర్లు షాపులో అవసరానికి సరిపడా రైస్ బ్యాగులు వేయమంటే సమయానికి అందించేవారు కాదని రైస్ డిపోల యజమానులు చెబుతున్నారు. అడ్వాన్స్ ముందుగానే చెల్లించినా చాలామంది మిల్లర్లు బియ్యం సంచులను సమయానికి అందించేవారు కాదంటున్నారు. ప్రస్తుతం బిజినెస్ జరగని సమయంలో రైస్ బ్యాగులను తెచ్చి షాపులో ఇచ్చి వెళ్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారం సాగడంలేదని చెప్పినా డబ్బులెక్కడికిపోతాయి.. ఇవ్వాళ కాకుంటే రేపైనా తీసుకోవచ్చని మిల్లర్లు చెబుతున్నారంటున్నారు రైస్ ట్రేడర్ల నిర్వాహకులు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ కారణంగా బిజినెస్ లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు షాపుల అద్దె, ఇటు ఇంటి అద్దె చెల్లించలేక సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు అవకాశం కల్పించినా హాస్టళ్లు మూతపడటంతో ఎలాంటి బిజినెస్ లేకుండాపోయింది.

రూ.2 వేలు కూడా రావట్లేదు

గ్రేటర్ హైదరాబాద్‌లో రైస్ డిపోలు వేల సంఖ్యలో లెక్కకు మించి ఉన్నాయి. మహానగరంలోని ప్రతి ఏరియాలో నేడు రైస్ ట్రేడర్లు దర్శనమిస్తున్నాయి. ఇదే వ్యాపారాన్ని నమ్ముకుని పని చేస్తున్నవారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంది. 25 కేజీల బియ్యం బస్తాకు నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1,350 వరకు ధర ఉంది. కరోనా రాకముందు రోజుకు సగటుగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వ్యాపారం జరిగితే.., ఇప్పుడు హాస్టళ్లు మూసివేయడంతో రోజుకు రెండు బ్యాగులు కూడా అమ్ముడవ్వక కనీసం రూ.రెండు వేలు కూడా రావడంలేదని అంటున్నారు వ్యాపారులు. పూర్తిస్థాయిలో హాస్టళ్లు, విద్యాసంస్థలు తెరిస్తే కానీ పరిస్థితులు మారేలా కనిపించడం లేదంటున్నారు.

పూర్తిస్థాయిలో హాస్టళ్లు తెరిస్తేనే..

కరోనా కారణంగా వ్యాపారం మొత్తం దెబ్బతింది. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరుకు సడలింపులు కల్పిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించినా వ్యాపారం లేదు. హాస్టళ్లు, విద్యాసంస్థలు, ఇన్‌స్టిట్యూట్లు తెరిస్తే తప్పా వ్యాపారం జరగదు. హాస్టళ్లు అయితే ఒకేసారి స్టాక్ తీసుకెళ్తారు. బిజినెస్ బాగుంటుంది. ఇప్పుడు వ్యాపారం లేక కష్టంగా మారింది. చాలీచాలని డబ్బుతో బతికేదెలా? కుటుంబాన్ని పోషించేదెలా? – శివశంకర్, రైస్ డిపో నిర్వాహకుడు, అమీర్ పేట.

బల్క్‌గా అమ్ముడవ్వడం లేదు

కరోనా వల్ల పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. గతంతో రోజుకు 25 బ్యాగులు అమ్మేవాళ్లం. ఇప్పుడు రోజుకు గరిష్టంగా నాలుగు కూడా అమ్ముడవ్వడం లేదు. కరోనాకు ముందు వరకు రూ.15వేల నుంచి 20 వేల వరకు అమ్మకాలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనా వచ్చి జీవితాలు ఆగమయ్యాయి. బిజినెస్ లేక ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు ఇప్పుడు కనీసం రూ.రెండు వేలు రావడం కూడా గగనమైంది. బల్క్‌గా అమ్ముడవ్వడంలేదు. ఎప్పుడో ఒక రైస్ బ్యాగ్ అమ్ముతున్నాం. -వెంకటేష్, వ్యాపారి, వెంకటగిరి కాలనీ

Advertisement

Next Story

Most Viewed