కరోనా మరణాలపై మల్లగుల్లాలు

by vinod kumar |
కరోనా మరణాలపై మల్లగుల్లాలు
X

న్యూఢిల్లీ: కరోనా మరణాలపై కొన్ని రాష్ట్రాలు పారదర్శకత పాటించడం లేదు. మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నాయి. విషయం బయటపడగానే తిరిగి సవరింపులకు దిగుతున్నాయి. ఉద్దేశం ఏదైనా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు తొలుత కరోనా మరణాలను తక్కువగా చూపెట్టి, తర్వాత జాబితాలో కలుపుకున్నాయి. తాజాగా, ముంబయిలోనూ ఇదే తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముంబయిలో రిపోర్ట్ కాని కనీసం 450 కరోనా మరణాలు వెలుగుచూశాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ మరణాల జాబితాను సవరించే పనిలో పడింది.

గతనెల రెండోవారంలో ఢిల్లీలో కరోనా మరణాలపై గందరగోళం ఏర్పడింది. అధికారిక బులెటిన్ వివరాలు, ఆస్పత్రులు వెల్లడిస్తున్న సంఖ్యలకు పొంతనలేకుండా పోయింది. ఈ విషయం బహిర్గతం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం మరణాల జాబితాను సవరించుకోక తప్పలేదు. ఈ సవరింపుల తర్వాతే ఢిల్లీలో కరోనా మరణాలు భారీగా పెరుగుతూ రావడం గమనార్హం. మే 12న సుమారు 100 మరణాలున్న ఢిల్లీలో కొత్తగా, సుమారు 1,400లకు చేరాయి. పశ్చిమ బెంగాల్ కూడా కరోనా మరణాలను తొలుత దాచిపెట్టింది.

ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వ బృందాలు రాష్ట్రంలో పర్యటించిన తర్వాత ఈ విషయం లేవనెత్తాయి. దీంతో 72 కరోనా మరణాలు పశ్చిమ బెంగాలో జాబితాలో కలుపుకుంది. ముంబయిలోనూ కరోనా మరణాల నమోదులో లోపం ఏర్పడింది. కానీ, ఇది ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ల కాకుండా అంతర్గత సమీక్షల్లో జరిగిన పొరపాటుతో కనీసం 450 కరోనా మరణాలు జాబితా నుంచి గల్లంతయ్యాయి. ఈ మేరకు బ‌ృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తక్కువగా రిపోర్ట్ చేసింది. వాస్తవానికి 451 కరోనా పేషెంట్‌లను ఫాలోఅప్ చేయకపోవడంతో వారి వివరాలు లేకుండా పోయాయి. వారు మరణించడంతో ఆ సంఖ్య మరణాల జాబితాలో చేరలేదని ఓ అధికారి వెల్లడించారు.

ఈ విషయం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా వాటన్నింటిని జాబితాలో కలపాలని బీఎంసీ అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ 451 మరణాల్లో ముగ్గురు యాక్సిడెంట్‌లో మరణించారని, 20 మంది పేర్లు రెండుసార్లు రికార్డ్ అయ్యాయని బీఎంసీ అధికారులు తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే 57మరణాలను దశల వారీగా బులెటిన్‌లో ప్రకటించారని తెలిపాయి. అంటే సుమారు 371మరణాలు ఇంకా కరోనా మరణాల జాబితాలో చేరాల్సి ఉన్నదని ఓ అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed