- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరిలో ముంచి తీసినా కేసీఆర్ పాపాలు పోవు: రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీకి గడచిన ఐదేళ్ళలో, హైదరాబాద్ నగరానికి ఆరేళ్ళలో చేసిన అభివృద్ధి పనులను ‘ప్రగతి నివేదిక’ రూపంలో వెల్లడించిన మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలను చెప్పారని, ఆయన పేర్కొన్న గణాంకాల్లో ఒక్కటి కూడా నిజం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీకి పన్ను ఎగ్గొట్టినవారిలో సీఎం కూడా ఉన్నారని, ప్రగతి భవన్ సహా సచివాలయం లాంటి ప్రభుత్వ కార్యాలయలన్నీ కలిపి సుమారు రెండు వేల కోట్ల మేర బకాయి పడ్డాయని ఆరోపించారు. వరదనీరు సాఫీగా వెళ్ళే నాలాలను, మూసీ నదిని ఆక్రమించినవారిలో కేటీఆర్ సహా ఆయన అనుచరులు ఉన్నారని, ఆక్రమణలను తొలగించడానికి బదులుగా నాలాల వెడల్పును కుదిస్తూ నిర్ణయాలు తీసుకుని కబ్జాలకు చట్టబద్ధత కల్పించారన్నారు. ప్రెస్‌క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సోమవారం ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఆరున్నరేళ్ళ కాలంలో కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలకు వారిని గోదావరిలో ముంచి తీసినా పోవన్నారు. సీఎం సహాయ నిధికి వచ్చిన రూ.4వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయో లెక్కలే లేవని, సుమారు రూ.1500కోట్ల మేర స్కామ్ జరిగిందని ఆరోపించారు. గుడుంబా లేదు.. గుట్కా లేదు.. గాంబ్లింగ్ లేదు.. అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా ఆన్‌లైన్ ద్వారా జరిగే రమ్మీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ బంధువే ఉన్నారన్నారు. కమిషన్‌లకు అలవాటు పడిన కేసీఆర్ కుటుంబం విమానాశ్రయం వరకు మెట్రో రైల్ సేవలను కొనసాగిస్తామని చెప్పి పాతబస్తీని నిర్లక్ష్యం చేశారని, ఉద్దేశపూర్వకంగా గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టు వరకు నడుపుతూ అంచనా వ్యయాన్ని పెంచారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు పాలపొంగులాంటిదేనన్నారు.
ప్రపంచంలో అత్యధికంగా అబద్ధాలు ఉన్న పుస్తకం కేటిఆర్ విడుదల చేసిన ‘ప్రగతి నివేదిక’ అని చమత్కరించిన రేవంత్ రెడ్డి అందులో పేర్కొన్న మెట్రో రైలు లైన్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి రూ. 67వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని, నిజానికి అయిన ఖర్చు కేవలం రూ. 6వేల కోట్లు మాత్రమేనన్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు మెడికల్ కాలేజీలు చెరువుల్లోనే నిర్మాణమయ్యాయని, ఆయన అల్లుడికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు కూడా చెరువు భూమిని ఆక్రమించి కట్టినవేనన్నారు. నగరంలో కర్ఫ్యూ బూచిని చూపించి ప్రజల్లో టీఆర్ఎస్ కొత్త భయాలను తీసుకొస్తోందని, నిజానికి 1999 నుంచి ఇప్పటివరకు నగరంలో కర్ఫ్యూ లేనే లేదన్నారు. ‘మీకు కర్ఫ్యూ కావాలా’ అంటూ కేటీఆర్ అడుగుతున్నారని, కానీ కర్ఫ్యూ వచ్చినప్పుడు ఆయన లాగు తొడుక్కుంట ఏడున్నడో అని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీకి ప్రగతి భవన్ బకాయి
సీఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్ జీహెచ్ఎంసీకి కట్టాల్సిన పన్నులో రూ. 11,66,108 మేర బకాయి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరికీ వన్ టైమ్ సెటిల్‌మెంట్ అని చెప్పే ప్రభుత్వం ప్రగతి భవన్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉందన్నారు. జీహెచ్ఎంసీకి అత్యంత మొండి బకాయిదారు రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. సచివాలయంలోని ‘సీ’ బ్లాక్ రూ. 8,86,74,056, ‘డీ’ బ్లాక్ రూ. 39,17,13,619, ‘జీ’ బ్లాక్ రూ. 8,20,49,916 మేర బకాయి ఉందన్నారు.