జోష్‌లో రేవంత్ రెడ్డి… మరో సంచలన నిర్ణయం

by Shyam |   ( Updated:2021-02-17 08:03:58.0  )
జోష్‌లో రేవంత్ రెడ్డి… మరో సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి మరో అడుగు ముందుకేస్తున్నారు. రాజీవ్​ రైతు భరోసా పాదయాత్ర ఫుల్​ సక్సెస్​ కావడంతో… రాష్ట్రమంతా పాదయాత్ర చేసేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి జిల్లా రావిర్యాల వరకు చేసిన పాదయాత్ర అనుకున్న ఫలితాలిచ్చింది. కాంగ్రెస్​లోని సీనియర్లు అడ్డుపడ్డా… సక్సెస్​ అయింది. ఇదే జోష్​లో రాష్ట్రమంతా యాత్రకు సిద్ధమవుతున్నారు. దీనిపై పార్టీలోని తన అనుచరులతో కలిసి ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు వెన్నంటి ఉండి నడిచిన ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవితో పాటు నిన్నటి రాజీవ్​ భరోసా రణభేరికి కలిసి వచ్చిన నేతలతో సమాలోచనలు చేస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీ నుంచి రేవంత్​రెడ్డి గతంలోనే పాదయాత్రకు వ్యూహాలు పన్నారు. కానీ టీపీసీసీ అంశం బ్రేక్​ వేసింది. ఉత్తమ్​ రాజీనామాతో టీపీసీసీ చీఫ్​ కోసం పార్టీ కసరత్తు చేసినా… ఎటూ తెగలేదు. ఇదే సమయంలో సాగర్​ ఉప ఎన్నికలు వస్తుండటంతో టీపీసీసీ చీఫ్​ ఎంపిక వాయిదా వేశారు. కానీ అప్పటికే నెలల తరబడి రేపో… మాపో అంటూ కాలం వెళ్లదీశారు. రేవంత్​రెడ్డికే దాదాపు ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో అనూహ్యంగా జీవన్​రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం రేవంత్​రెడ్డి పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపును తీసుకువచ్చింది. అచ్చంపేట నుంచి సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి కూడా సహకారం లభించింది. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లురవితో పాటు పలువురు నేతలు రేవంత్​కు వెన్నంటి ఉండి నడిచారు. అనంతరం రావిర్యాల సభతో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఇప్పుడు తెలంగాణ అంతటా పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు.

ముందుగా పార్టీ అనుమతి కోసం ఠాగూర్​కు ప్రణాళిక మ్యాప్​ను అందించనున్నట్లు చెబుతున్నారు. కానీ పార్టీ నుంచి అనుమతి వస్తుందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇటీవల ఉత్తమ్​ చేసిన ప్రకటన ప్రకారం… నేతలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు కానీ ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాల్లో చేస్తే మాత్రం అనుమతి తీసుకోవాలన్నారు. వాస్తవంగా ఇప్పుడు రేవంత్​రెడ్డి చేసిన యాత్ర కూడా తన పరిధి కాని నియోజకవర్గమే. కానీ రైతు భరోసా సభ రాజీవ్​ రైతు పాదయాత్రగా మారింది. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమే. కానీ సక్సెస్​ అయింది. ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే జోష్​తో చేస్తే… పార్టీకి కొంత లాభమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే రేవంత్ యాత్రతో పోలిస్తే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న యాత్రకు కొంత స్పందన తక్కువే. ఇద్దరు నేతలు ఒకేసారి చేయడమే పెద్ద తప్పుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. వాస్తవంగా సీనియర్లకు రేవంత్​ యాత్ర అసలే ఇష్టం లేదు. అందుకే భట్టీని ప్రోత్సహించారని టాక్​. కానీ రేవంత్​ యాత్రకు వచ్చిన ప్రజా స్పందన భట్టీ యాత్రకు రాలేదు. ఇప్పుడు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తే అనుకూల పవనాలు ఉంటాయనేది పార్టీ నేతల్లో ఉన్న చర్చ. ఇప్పుడు చేసిన యాత్రను విమర్శిస్తున్న సీనియర్లకు కూడా రావిర్యాల సభా వేదిక నుంచి నేతలు సవాల్​ విసిరినట్లే చేశారు. ఒకప్పుడు వైఎస్​ పాదయాత్రకు కూడా అధిష్టానం అనుమతి లేదని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి ఆ పాదయాత్రే కారణమని, ఇప్పుడు కూడా అంతేనంటూ ముడిపెడుతున్నారు. అంటే ఏదిఏమైనా రేవంత్​ రెడ్డి పాదయాత్ర తెలంగాణ అంతటా జరుగుతుందని ఖాయమైనట్టే.

సీఎం కేసీఆర్ ​సురభి నాటక కర్త :రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed