ఉద్దండులను సైతం ఓడించి… రేవంత్ పొలిటికల్ కెరీర్‌

by Shyam |   ( Updated:2021-06-28 04:20:06.0  )
ఉద్దండులను సైతం ఓడించి… రేవంత్ పొలిటికల్ కెరీర్‌
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎంచుకున్న రంగంలో సాదాసీదా ప్రయత్నాలతో లక్ష్యాన్ని సాధిస్తే పెద్దగా థ్రిల్లింగ్ ఉండదు.. కష్టాలు కన్నీళ్లు దాటుకుంటూ సవాళ్లను ఎదుర్కొంటూ సాధించే విజయాలలో ఉండే కిక్కే వేరు అన్నట్లుగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి రాజకీయ అడుగులు సస్పెన్స్ గా..థ్రిల్లింగ్ గా సాగాయి. సాధించాలనే తపన, మాట చమత్కారం.. తెగింపు రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిని చేశాయి.. ఒక్కసారి అతని గతంలోకి వెళితే రాజకీయ ప్రస్థానం అందరికీ మార్గదర్శకం అవుతుంది.
2006లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ తన సొంత మండలమైన వంగూరు రిజర్వు కావడంతో.. ఇతర మండలాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఉప్పునుంతల, మిడ్జిల్ మండలాలు జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు స్థానాలలో రేవంత్ రెడ్డి మిడ్జిల్ ను ఎన్నుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభుత్వానికి మంచి పేరు ఉంది. అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించి జడ్పీటీసీగా పోటీలో ఉన్నారు.

అయినప్పటికీ రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా అక్కడే పోటీలో నిలిచారు. స్థానికేతరుడు, రాజకీయ అనుభవం పెద్దగా లేని వారు, పైగా ఏ పార్టీ మద్దతు లేని వారని అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రబ్బానీ గెలుపు తథ్యం అనుకున్నారు. కానీ రాజకీయ చతురత, మాటల చమత్కారాలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఉన్న కొంత వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తల మద్దతును కూడగట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1200 మెజార్టీతో ఘన విజయం సాధించి ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారారు.

2008 లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు వచ్చాయి. అప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడంతో పాటు, అధిష్టాన వర్గాన్ని ఒప్పించి మెప్పించి టికెట్ ను సాధించారు. కానీ స్థానిక సంస్థల ప్రతినిధులలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన వారు అత్యధిక మంది ఉన్నారు. మెజారిటీ ఓట్లు తమవే కావడం, అప్పటికే సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎమ్మెల్సీగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి పోటీలో ఉండడంతో జడ్పీటీసీగా ఏదో గెలిచాడు.. ఎమ్మెల్సీగా గెలవడం అంత సులభం కాదని అందరూ భావించారు.. అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ అప్పట్లో ఎమ్మెల్సీగా ఆయా పార్టీల నుండి గెలుపొందిన స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లను సాధించడంతో పాటు కాంగ్రెస్ సభ్యుల ఓట్లను పెద్ద ఎత్తున చేయించడంతో 110 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

రాజకీయ ఉద్దండునిపై ఎమ్మెల్యేగా పోటీ

ఎమ్మెల్సీగా పోటీ చేసే క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనూ ప్రచారం చేశారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. అప్పటికే ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి, టీడీపీ ప్రభంజన సమయంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుర్నాథ్ రెడ్డిని ఢీ కొనడం అంటే కొండతో పొట్టేలు ఢీకొనడమే అని భావించే పరిస్థితులు అవి. అక్కడి టీడీపీ నాయకులు అప్పటికే పార్టీ అధిష్టానానికి మన నియోజకవర్గానికి ఒక బలమైన అభ్యర్థి కావాలని విజ్ఞప్తి చేయడం, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపడంతో టీడీపీ అధిష్టానం ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డితో హోరాహోరీగా సాగిన పోరులో 6000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. 2014లో జరిగిన పోటీలో తన మెజారిటీని 11 వేలకు పైగా పెంచుకొని విజయం సాధించారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో కాంగ్రెస్ లో చేరి 2018లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి మరోమారు తన రాజకీయ చతురతను చాటుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ వచ్చారు.

చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు

పీసీసీ అధ్యక్ష ఎన్నికల అంశం అటు కాంగ్రెస్ వర్గాలతో పాటు అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ కలిగించింది. పిసిసి పగ్గాలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం పోటీ పడడం, అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపుతుందని భావించి సీనియర్లు రేవంత్ కు అవకాశం దక్కకుండా ప్రయత్నాలు చేయడంతో ఒకానొక దశలో పీసీసీ రేవంత్‌కు దక్కుతుందో లేదన్న అనుమానాలు కలిగాయి. కానీ అధికార పార్టీ నేతలకు దీటుగా నిలబడటం, తెగింపు, పోరాట పటిమ ఉన్న రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడంతో యుద్ధంలో చివరి పంచ్ మనది అయితే ఆ కిక్కే వేరప్పా అన్నసినిమా డైలాగ్ అక్షరాల సరిపోయేలా..మొదటి నుండి తాను సాధిస్తున్న విజయపరంపరను కొనసాగించేలా పీసీసీ పీఠం దక్కించుకుని రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కారు.

Advertisement

Next Story