పీసీసీ చీఫ్‌గా రేవంత్ వైపే మొగ్గు కానీ,..

by Shyam |   ( Updated:2020-08-10 21:33:51.0  )
పీసీసీ చీఫ్‌గా రేవంత్ వైపే మొగ్గు కానీ,..
X

దిశ, న్యూస్ బ్యూరో : కాంగ్రెస్​ రాష్ర్ట పీఠం ఎవరికి దక్కుతుందో.. ఉత్తమ్ వారసుడిగా ఎవరు ఎంపిక కానున్నారో.. మహా సముద్రమంటి పార్టీలో గెలిచి నిలిచే నాయకుడెవరో.. అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు, చర్చలు, సంప్రదింపులు వంటి అతి రసవత్తరమైన పదవి పందేరంలో పైచేయి సాధించే నేత ఎవరో.. పార్టీలో ఇప్పుడు ఎటు చూసినా ఇదే గుసగుస.. ఎవరిని కదిపిన టీపీసీసీ పీఠం గురించిన చర్చే… టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఐదేళ్లు పూర్తయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాడనే ఉద్దేశంతో అధిష్టానం పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్‌కు పగ్గాలు అప్పగించింది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ ఘోరంగా విఫలమయ్యారు. తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్వయంగా గెలిచిన హుజూర్‌నగర్‌లో కూడా భార్యను గెలిపించలేకపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. హైకమాండ్ కూడా దీనిపై సమాలోచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ పీఠం కోసం కొందరు సీనియర్లు చేస్తున్న ప్రయత్నాల వార్తలతో పాటు ఎక్కువగా మాత్రం రేవంత్‌రెడ్డి పేరు ప్రచారం జరిగింది. అయితే రేవంత్​ను పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం తెలిసిన విషయమే.

సోనియా, రాహుల్ గాంధీలు రేవంత్ రెడ్డిని ఉత్తమ్ ప్లేస్‌లో దాదాపు ఖాయం చేయగానే కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నల్గొండ సీనియర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి, వీహెచ్ జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో ఆది నుంచి ఉన్న వారికే పీఠం ఇవ్వాలని హైకమాండ్​కు తెలియజేశారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని తిరుగుబావుటా కూడా ఎగురవేశారు. ఈ మేరకు రాష్ట్ర ఇన్​చార్జి ఆర్‌సీ కుంతియా సమక్షంలోనే బాహాబాహీకి కూడా దిగారు. వరుస ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక వచ్చింది.

మారుస్తున్నారా…?

ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌ను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందని, పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించేందుకు హైకమాండ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా టీపీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడిన హైకమాండ్ ఫైనల్‌గా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు రేవంత్‌రెడ్డి అనే భావనకు వచ్చినట్లుగా సమాచారం. రేవంత్‌రెడ్డితో పాటు, పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా హైకమాండ్ మంతనాలు జరిపి, అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామనే హామీ తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రాష్ర్టంలో తాజా పరిస్థితులు, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కునే సత్తా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం రేవంత్​కు ఉన్నాయని భావించే హైకమాండ్​ ఆ దిశగా పావులు కదుపుతున్నదనే చర్చ జరుగుతున్నది.

కాగా, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం ఇప్పటికీ తమ ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూనే ఉన్నట్టు వినికిడి. పలువురు సీనియర్లు రేవంత్​ రెడ్డి నియామకానికి తీవ్రంగా అడ్డుపడుతున్నట్టు ఓ వర్గం తెలుపుతున్నది. ఆయనకు వ్యతిరేకంగా జగ్గారెడ్డి వంటి నేతలు ఇప్పటికీ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇక వీహెచ్ వంటి నేతలు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వారు, పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్​కు తప్ప ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తామని మరికొందరు సీనియర్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే రేవంత్​ విషయంలో సీనియర్లు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితులు, టీఆర్​ఎస్​ సర్కార్​కు ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతవైపే చూస్తున్నట్టు సమాచారం. రేవంత్​రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్​ లీడర్​ కాకపోయినా కర్ణాటకతో పోల్చి చూస్తున్నారు. అక్కడ సిద్దరామయ్య కూడా ఆది నుంచి కాంగ్రెస్​ నేత కాకపోయినా శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గమనించాలని పేర్కొంటున్నారు. సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా సరే పీఠంపై కూర్చోబెట్టడానికే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్​ రెడ్డి అదే పంథాలో హైకమాండ్​ దగ్గర మంచి గుర్తింపు పొందడంతో కలిసివచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా హైకమాండ్ అధికారిక ప్రకటన తర్వాతే తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చర్చనీయంశంగా మారింది.

మాజీ బాస్‌తో సత్సంబంధాలున్నాయంటూ ఫిర్యాదు..

ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్లు, రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా చక్రం తిప్పుతున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికీ తన గాడ్ ఫాదర్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నాడని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పదవి ఇస్తే చంద్రబాబే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తాడని అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని, అందుకే రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి ఆలస్యం అవుతున్నట్లు ప్రచారం జరిగింది.

టాస్క్ అదే..

పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లోనైనా టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నయంగా మారాలని అధిష్టానం భావిస్తున్నది. వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుందని, అందరిని కలుపుకుని పోవాలని హైకమాండ్ రేవంత్‌కు చెప్పినట్లు పలువురు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అందరు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవాలని, సీనియర్లతో మంతనాలు జరిపి అంగీకారయోగ్యం తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్​ ప్రస్తుతం సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కానీ టీపీసీసీ రేసులో రేవంత్​ సఫలమవుతారో.. లేదో భవిష్యత్తే తేలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

నేనూ రేస్‌లో ఉన్నా : జగ్గారెడ్డి

టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో చర్చ జరుగుతున్నదనే సమాచారం ఉందని, టీపీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నానన్నారు. తనకు అవకాశం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీని కోరానని, అలాగైతే సీనియర్లందరినీ కలుపుకుని పోతానని పేర్కొన్నారు. తన ప్రకటనలతో కొంతమంది తికమక పడుతున్నారని, కానీ ప్రతి మాట వ్యూహాత్మకంగానే ఉంటుందన్నారు. తనను కొందరు కావాలనే టీఆర్ఎస్ కోవర్టు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తను అమ్ముడుపోయే వ్యక్తికి కాదన్నారు. సోషల్​ మీడియాగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారు వారి అడ్రస్​, ఫోన్​నెంబర్లకు కూడా పెడితే వాళ్ల ఇళ్లకే వెళ్లి అనుమానాలు తీరుస్తానని జగ్గారెడ్డి అన్నారు.

Advertisement

Next Story