జీఎస్టీ పరిహారం చెల్లింపు బాధ్యత కేంద్రానిదే !

by Shyam |
జీఎస్టీ పరిహారం చెల్లింపు బాధ్యత కేంద్రానిదే !
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీఎస్టీని అమలుచేస్తున్న కేంద్రం ఆర్థికంగా బెంచ్‌మార్కు మేరకు వృద్ధిని సాధించలేనప్పుడు ఏర్పడే నష్టానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు విడతల్లో జీఎస్టీ నష్టపరిహారం అందాల్సి ఉందని, దీన్ని వెంటనే చెల్లించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతీ నెలా సెస్‌ను వసూలు చేస్తూ ఉందని, దీంట్లోంచే రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఉంటుందని, ఈ సంవత్సరం తెలంగాణకు మూడు విడతల్లో సుమారు రూ. 2,638 కోట్లు రావాల్సి ఉందని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళారు.

కేంద్రమే అప్పుచేసి సమకూర్చాలి

కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చిందని, ఆ రెంటికి బదులుగా కేంద్రమే ద్రవ్య సంస్థల నుంచి అప్పు తీసుకుని రాష్ట్రానికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని విడుదల చేయాలని హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రాలు అప్పు చేసుకుని సమకూర్చుకునే విధానానికి తెలంగాణ వ్యతిరేకమన్నారు. ఈ నెల 1వ తేదీన జరిగిన మంత్రుల స్థాయి జీఎస్టీ సమావేశంలో సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించామని గుర్తుచేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రూ. 25,058 కోట్లను కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమచేసిందని, ‘కాగ్’ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.

Advertisement

Next Story