వామ్మో.. నిరుద్యోగ రేటు అంత శాతానికి పెరుగుతుందా !

by Shyam |
వామ్మో.. నిరుద్యోగ రేటు అంత శాతానికి పెరుగుతుందా !
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులతో పాటు దేశంలో 13.5 కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు ఉందని అంతర్జాతీయ మేనెజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసింది. అంతేకాకుండా సుమారు 12కోట్ల మంది పేదరికంలోకి జారుకోనున్నట్టు నివేదిక ఇచ్చింది. ఈ పరిణామాలతో వినియోగదారుల ఆదాయం, వ్యయం, పొదుపుపై ప్రభావం ఉంటుందని, తలసరి ఆదాయం క్షీణించడమే కాకుండా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) కూడా ప్రభావానికి గురవుతుందని పేర్కొంది. దేశంలో పాజిటివ్ కేసులను గమనిస్తే రోజురోజుకు రికవరీ తీరు ‘డబ్ల్యూ’ ఆకారంలో మారుతున్నట్టుగా ఉంది. దీనివల్ల దేశ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం వరకూ కుంచించుకుపోయే ప్రమాదముందని, 2021-22 నాటికి 0.8 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని ఆర్థర్ డి లిటిల్ అంచనా వేసింది. జీడీపీ మందగమనంతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతమున్న నిరుద్యోగ రేటు 7.6శాతం నుంచి 35 శాతానికి పెరిగే అవకాశముందని, దీనివల్ల 13.5 కోట్ల మంది ఉద్యోగాలను పోగొట్టుకోవడమే కాకుండా మొత్తం 17.3 కోట్ల మంది నిరుద్యోగులుగా మారే ప్రమాదముంది. ఈ పరిణామాలతో 12కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని, వీరిలో 4కోట్ల మంది నిరుపేదలుగా మారే అవకాశముందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story