- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ క్లాసులు సరే.. సౌకర్యాల మాటేంటి?
దిశ, న్యూస్‌బ్యూరో:
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠాలు వినేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెక్నాలజీ, మొబైల్స్, కంప్యూటర్లు అందుబాటులో లేని విద్యార్థులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, వారికి సౌకర్యాలను కల్పించేందుకు మాత్రం ముందుకు రాలేదు. గ్రామాల్లో యువతను ఇందుకు ఉపయోగించుకోవాలని, టీవీల్లో పాఠాలు వినేందుకు ఇతరులపై ఆధారపడాలని సూచించింది.
దూరదర్శన్, టీశాట్ చానళ్ల ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఎన్‌సీఈఆర్‌టీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం కుటుంబాలకు టీవీ సౌకర్యం లేదని తేలింది. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో పీఓఎస్ మిషన్లకు సిగ్నల్ రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ఎలా చేరవేస్తారనే దానిపై ప్రభుత్వం రూట్ మ్యాప్ ప్రకటించలేదు. కాగా, ఇంటర్నెట్, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, టీవీలు లేని విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించాలని నిర్ణయించింది. వారి అవసరాలను తీర్చేందుకు విద్యాశాఖ ఎలాంటి బాధ్యత తీసుకోలేదు.
నష్టపోతున్న గ్రామీణ విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు వినేందుకు అవసరమైన వ్యవస్థలు లేవని ప్రభుత్వ, ఇతర సర్వేల్లోనూ వెల్లడయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కలిపి దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు అంచనా. ఓ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 40 శాతం విద్యార్థుల కుటుంబాలకు స్మార్ట్ఫోన్లు లేవు. 75 శాతం స్కూళ్లలో ఇంటర్నెట్, 50 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో టీవీలు లేవు.
దీంతో ఇంటర్నెట్, టీవీలు లేని విద్యార్థులు నష్టపోతారు. గ్రామ పంచాయతీల టీవీలను వినియోగించుకోవాలని సూచించినప్పటికీ రాష్ట్రంలో 9 వేలకు పైగా జీపీలకు ఇంటర్నెట్ సౌకర్యం లేనట్టు తేలింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే యువత, సీనియర్ విద్యార్థుల స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్లను విద్యార్థులకు అందించేలా బాధ్యత తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. అలాంటి వారిని గుర్తించడానికైనా కనీసం 15 రోజులు పట్టనుంది. తరగతులు మాత్రం ఐదు రోజుల్లోనే ప్రారంభించనున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోతున్నారు.
విద్యార్థులను చేరుకునేదెలా?
ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి ఈ-కంటెంట్, వర్క్ షెడ్యూల్‌ను సిద్ధం చేసి విద్యార్థులకు అందివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులతో అనుసంధానమై ఉండాలని విద్యాశాఖ ఆదేశించింది. డీఈఓ, ఎంఈఓలు వాట్సాప్‌ల్లో వర్క్షీట్లను ఉపాధ్యాయులకు పంపించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ప్రింట్ తీసి విద్యార్థికి ఎలా ఇచ్చేదని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
వారంలో ఐదు రోజులకు మించకుండా దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలను బోధించనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. డీటీహెచ్ సర్వీసుల్లో ప్రస్తుతం టీశాట్ చానెల్స్ రావడం లేదు. టీవీలు లేని విద్యార్థులు గ్రామంలోని ఇతరుల ఇళ్లలోకి వెళ్లి క్లాసులు వినాలని సూచించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రతీ రోజు ఇతరుల పిల్లలను, తల్లిదండ్రులను ఇళ్లలోకి రానిచ్చే పరిస్థితి ఉండదు, దీంతో ఆ విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు వినే అవకాశం ఉండదు.
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ కోసం అదనపు భారం..
గ్రామీణ ప్రాంతాల్లోని 50శాతానికి పైగా విద్యార్థుల కుటుంబాల్లో స్మార్ట్ఫోన్లు లేవని సర్వేలో తేలింది. డిజిటల్ పాఠాలు వినేందుకు పిల్లల కోసం స్మార్ట్ఫోన్లు కొత్తగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫోన్లతో పాటు ఇంటర్నెట్ కోసం రీచార్జి చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఆరు నెలలుగా అవస్థలు పడుతుండగా కనీసం రూ.10 వేలకు తగ్గకుండా మొబైల్స్, ప్రతి నెలా రీచార్జిలు చేయించడం తల్లిదండ్రులకు భారంగా మారనుంది.
అంతంత మాత్రంగా గడుపుతున్న గ్రామీణ కుటుంబాలు ఆన్‌లైన్ క్లాసుల కోసం ఖర్చు చేసే స్థితిలో లేవని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, ఆయా యాజమాన్యాలకు ఇబ్బంది కలగకుండా ఆదేశాలు జారీ చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి
డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వ హడావిడిగా ఆదేశాలు జారీ చేసిందని భావిస్తున్నాం. రూరల్ ఏరియాల్లో ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాలు విద్యార్థుల వద్ద లేవు. పాఠశాలల్లో, గ్రామ పంచాయతీల్లోనూ టీవీలు, ఇంటర్నెట్లు లేవని మా సర్వేలో తెలిసింది. స్మార్ట్ఫోన్ల వంటివి ఉన్న విద్యార్థులు పర్వాలేదు గానీ ఇతర విద్యార్థులు నష్టపోతారు. క్లాసులు నిర్వహించామని చెప్పుకోవడానికి విద్యార్థుల అవకాశాల్లో వివక్ష ఉండకూడదు. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు అవసరమైన వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అందరికీ ఇంటర్నెట్, ఇతర పరికరాలు అందించిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని కోరుతున్నాం.
-చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి