మార్కెట్లోకి జియో ల్యాప్‌టాప్స్!?

by Harish |
మార్కెట్లోకి జియో ల్యాప్‌టాప్స్!?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ తక్కువ ధరలో ఇంటర్నెట్‌ను అందించిన సంగతి తెలిసిందే. త్వరలో కొత్త టెక్నాలజీ 5జీని స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకురానున్నట్టు ప్రకటించింది. తాజాగా జియో నుంచి తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను కూడా తీసుకొచ్చేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలకమైన ప్రక్రియను కొనసాగిస్తోందని, ‘జియో బుక్’ పేరుతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ల తయారీ కూడా ప్రారంభమైనట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మే నెలలోగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్తగా రానున్న ‘జియో బుక్’ జియో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. జియో ఎల్‌టీఈ సపోర్ట్‌తో కూడా పనిచేయనున్నట్టు సమాచారం. గతంలో క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సీనియర్ ప్రోడక్ట్ డైరెక్టర్ మిగ్యుల్ న్యూన్స్ జియో నుంచి సెల్యూలార్ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌లు రానున్నట్టు చెప్పారు. ఇన్నాళ్లకు ఈ అంశంపై మరోసారి చర్చకు వచ్చింది. అంతేకాకుండా, చైనా తయారీ కంపెనీ బ్లూ బ్యాంక్ కమ్యునికేషన్ టెక్నాలజీ ‘జియోబుక్’ ల్యాప్‌టాప్ తయారీ కోసం ఒప్పందం కూడా చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఈ సంస్థ ఇప్పటికే 5జీ జియో స్మార్ట్‌ఫోన్‌లను అభివృద్ధి చేస్తోంది.

త్వరలో రానున్న ‘జియో బుక్’ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇన్-బిల్ట్ 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్‌ప్లేతో, 11 నానో మీటర్ టెక్నాలజీతో పనిచేయనుంది. 5 గిగాహెర్ట్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ పోర్ట్, క్వాల్‌కామ్ ఆడియో చిప్‌లను ఇందులో వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇవికాకుండా, ఇందులో జియో మీట్, జియో యాడ్ సర్వీస్, జియో స్టోర్, జియో పేజేస్ ఇన్-బిల్ట్ ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఈ ల్యాప్‌టాప్ ఎంత ధరలో మార్కెట్లోకి తీసుకురానున్నదో ఇంకా తెలియలేదు. తక్కువ ధరలో మొబైల్‌ఫోన్‌లను తీసుకొచ్చినట్టే ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువలో అందిస్తుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed