ఏపీలో గ్రీన్ జోన్‌లో సడలింపు నిబంధనలివే!

by srinivas |
ఏపీలో గ్రీన్ జోన్‌లో సడలింపు నిబంధనలివే!
X

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి గ్రీన్‌ జోన్‌లో లాక్‌డౌన్ సడలింపులిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మార్చి 22 నుంచి ఏపీలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏపీలో ఉన్న ఏకైక గ్రీన్ జోన్ విజయనగరం జిల్లా. మే 4తో ఇక్క నిబంధనలకు చెల్లుచీటీ వేస్తారని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో గ్రీన్ జోన్ ఒక్కటే కావడంతో ఈ జిల్లాలో అనుసరించాల్సిన విధానంపై విధాన నిర్ణయం జరగలేదు.

దీంతో నిన్నటి నుంచి అమలులోకి రావాల్సిన లాక్‌డౌన్ ఎత్తివేత నిబంధనలు అమలు కాలేదు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ విధివిధానాలు ఖరారు చేయకుండానే సమావేశం ముగించారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేతపై స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో జిల్లా అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులన్నింటికీ నిబందనలు తొలగించారు.

సామాజిక దూరం పాటిస్తూ షాపింగ్ వెసులుబాటు కల్పించారు. దీంతో విజయనగరం జిల్లాలో సుదీర్ఘ విరామం తరువాత దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే రవాణా సదుపాయం లేకపోవడంతో సొంత వాహనాలు కలిగిన వారే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే జిల్లా దాటి వెళ్లేందుకు సీపీ అనుమతి తప్పని సరి అని అధికారులు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రం దాటి వెళ్లాలంటే డీజీపీ ఆఫీస్ నుంచి అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు.

విజయనగరం జిల్లాలోని పరిశ్రమల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తుండగా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారాల నిమిత్తం ఉంటున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో వీరంతా స్వస్థలాలకు చేరాలని భావిస్తున్నారు. వారంతా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకుని అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వలస కార్మికుల కోసం రెవెన్యూ యంత్రాంగం బస, భోజనం ఏర్పాటు చేసింది.

Tags: green zone, vizianagaram district, ap, lockdown free, Coronvirus

Advertisement

Next Story

Most Viewed