గుంట వ్యత్యాసమున్నా.. అంతా ఆగినట్లే

by Aamani |
గుంట వ్యత్యాసమున్నా.. అంతా ఆగినట్లే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గతంలోని షేత్వారుకు.. తాజా రికార్డులకు భూ విస్తీర్ణంలో తేడాలుండడంతో భూముల క్రయవిక్రయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. గుంట భూమి తేడా ఉన్నా రిజిస్ట్రేషన్లు కావడం లేదు. 1954-1955లోని షేత్వారు, 1978-1980లో చేసిన రీసర్వే రికార్డును ప్రామాణికంగా తీసుకున్న రెవెన్యూ అధికారులు సరి చేసేందుకు సర్కారు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు నిత్యం తహసీల్, కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎల్ఆర్ యూపీ వచ్చాక.. పూర్తిగా ఆన్‌లైన్​కావడం, భూ విస్తీర్ణం తేడాలను సరి చేసేందుకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో పెద్ద సమస్యగా మారింది.

గుంట భూమి తేడాతో ముప్పుతిప్పలు

తానూరు మండలం హంగిర్గా శివారులో ఓ సర్వే నెంబరులో 10.02 ఎకరాల భూమి ఉంది. షేత్వారు ప్రకారం 10.02 ఎకరాల భూమి ఉండగా, పహాణీ, పాసుపుస్తకాల ప్రకారం 10.03 ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచి ఐదెకరాల భూమిని భోజరాం పటేల్ అనే వ్యక్తి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మ్యూటేషన్​కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఇందులో గుంట భూమి ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టరు) సమస్య ఉంది. దీంతో రెవెన్యూ అధికారులు మ్యూటేషన్​చేయకుండా పెండింగ్ లో పెట్టారు. దీంతో స్థానిక తహసీల్దారు ద్వారా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్‌కు పంపగా, అంతలోనే అప్పటి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బదిలీ అయ్యారు. అదే సమయంలో ధరణి పోర్టర్​రావడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. గుంట భూమి తేడా కారణంగా మ్యూటేషన్​నిలిచిపోవడంతో తహసీల్దారుకు దరఖాస్తు చేసి, ఇప్పటికీ మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు.

ఐదు వేలకు పైగా ఆర్ఎస్ఆర్ సమస్యలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భోజరాం పటేల్ లాంటి కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు ఐదు వేలకుపైగా ఆర్ఎస్ఆర్ సమస్యలున్నాయి. వాస్తవానికి ప్రస్తుత సమస్యలో ఆర్ఎస్ఆర్ అనేది పెద్ద సమస్యగా మారింది. ధరణి పోర్టల్​రాకముందు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు.. తహసీల్దార్లు పంపిన ఆర్ఎస్ఆర్ సమస్యల ఫైళ్లను పరిష్కరించేవారు. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ కలెక్టర్లు లేకపోవడం.. ఇంతలోనే ధరణి అందుబాటులోకి రావడంతో ఇలాంటి సమస్యలు పెండింగ్​లోనే ఉండిపోయాయి. 1954-1955లో షేత్వారు రికార్డు తయారు చేయగా.. దీనిని ప్రామాణికంగా తీసుకుని 1978-1980లో రీసర్వే చేశారు. వీటిలో విస్తీర్ణమే ఆధారంగా చేసుకుని రెవెన్యూ రికార్డుల్లో చేతి రాతతో రాస్తూ వస్తున్నారు. కాలక్రమంలో కొందరు పట్వారీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కావాలనే ఎక్కువ విస్తీర్ణం ఉందని తప్పుగా రాయడం, పట్టాదారు చనిపోతే ఆయన పేరు తొలగించకుండానే పిల్లల పేర్లు రాయడంతో రికార్డుల్లో భూవిస్తీర్ణం పెరిగిపోయింది. షేత్వారు, రీసర్వే రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో భూమి తక్కువగా ఉంది.

ఆన్‌లైన్‌లో భూములు.. ఆర్ఎస్ఆర్‌తో అవస్థలు

2016లో ఎల్ఆర్ యూపీ వచ్చాక భూముల వివరాలు పూర్తిగా ఆన్​లైన్ లో నమోదు చేశారు. సమగ్ర భూసర్వే తర్వాత వివరాలు ఆన్​లైన్​లో ఉండగా.. షేత్వార్ ప్రకారమే నమోదు చేసి లాక్ చేశారు. దీంతో ఆర్ఎస్ఆర్ సమస్య తెరపైకి వచ్చింది. కంప్యూటర్ లాక్ అయ్యాక.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. మ్యూటేషన్ చేసేందుకు వెళ్లగా.. ఆర్ఎస్ఆర్ సమస్య చూపుతోంది. రోజులు, నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండడం లేదు. అదీకాక రోడ్లు, కాలువలు, ఇండ్ల నిర్మాణం కోసం భూములను సర్కారు సేకరించినా.. తమ పేరిట మ్యూటేషన్ చేసుకోకపోవడంతో పాత పట్టాదారుల పేర్లతోనే ఉన్నాయి. ఇటీవల ప్రాజెక్టులు, చెరువులకు సంబంధించిన భూములను రెవెన్యూ రికార్డుల్లో సంబంధిత శాఖ పేరిట మ్యూటేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని, మ్యూటేషన్లు కాక తిప్పలు పడుతున్నారు. కొందరు కొత్తగా వచ్చిన ధరణిలోనూ పెండింగ్ మ్యూటేషన్ల కింద ఎకరానికి రూ.2500 చొప్పున చెల్లించగా.. నేటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. తిరస్కరించిన వారి డబ్బులు తిరిగి వస్తాయో.. లేదో తెలియని పరిస్థితి ఉంది.

Advertisement

Next Story

Most Viewed