Rich CMs : దేశంలోనే సంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎంగా మమత : ఏడీఆర్

by Hajipasha |
Rich CMs : దేశంలోనే సంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎంగా మమత : ఏడీఆర్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోనే సంపన్న సీఎం(Rich CMs) మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. చంద్రబాబు నికర ఆస్తుల విలువ దాదాపు రూ.931 కోట్లకుపైనే ఉంటుందని పేర్కొంది. తనకు రూ.10 కోట్ల దాకా అప్పులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 2024లో తన వ్యక్తిగత సంపాదన(CMs net worth) రూ.18 లక్షలకుపైనే ఉంటుందని చంద్రబాబు చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లలోని సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సోమవారం ఏడీఆర్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూకు రూ.332 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు చెప్పింది. 2024లో తనకు సొంత ఆదాయమేదీ రాలేదని ఆయన తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రూ.51 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయన్నారు. ఆయనకు రూ.23 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. 2024లో సిద్ధరామయ్యకు వివిధ వనరుల ద్వారా రూ.20 లక్షల వార్షిక ఆదాయం వచ్చిందని ఏడీఆర్ పేర్కొంది. దేశంలోని 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అప్పుల విలువ రూ.1 కోటికిపైనే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా ప్రస్తావించారని తెలిపింది.

మమత పేరిట స్థిరాస్తులేం లేవు

అతి తక్కువ ఆస్తులు(Poor CMs) కలిగిన సీఎం ఎవరో తెలుసా ? ఈ ప్రశ్నకు సమాధానం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని ఏడీఆర్ సంస్థ చెబుతోంది. సీఎం మమతా బెనర్జీ ఆస్తుల విలువ రూ.15.38 లక్షలేనని తెలిపింది. అవన్నీ చరాస్తులేనని ఏడీఆర్ పేర్కొంది. మమత పేరిట స్థిరాస్తులేం లేవని పేర్కొంది. రూ.55 లక్షలకుపైనే ఆస్తులు కలిగిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు తక్కువ ఆస్తులున్న సీఎంల జాబితాలో రెండో స్థానం దక్కింది. తనకు స్థిరాస్తులేం లేవని ఆయన వెల్లడించారు. 2024లో తనకు రూ.14.52 లక్షల వార్షిక ఆదాయం వచ్చిందని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ జాబితాలో మూడో స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు. ఆయనకు దాదాపు రూ.1.18 కోట్ల ఆస్తులు ఉండగా.. దానిలో రూ.31.80 లక్షల చరాస్తులు, రూ.86.95 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. 2024లో విజయన్‌కు రూ.2.87 లక్షల ఆదాయం వచ్చింది.

Next Story

Most Viewed