టిక్ టాక్ ఎందుకంత ఫేమస్?

by Shyam |
టిక్ టాక్ ఎందుకంత ఫేమస్?
X

దిశ, వెబ్‌డెస్క్:
టిక్ టాక్ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. బిలియన్ల మంది ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాదాపు 700 మిలియన్ల మంది రోజూ ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. మ్యూజిక్, వీడియో, డ్యాన్స్, వైరల్ ఛాలెంజ్‌లు కలగలిసిన ఈ యాప్ 2020లో పాప్ కల్చర్‌కి వారధిగా మారింది. యాప్ కమ్యూనిటీ ఎంతలా పెరిగిందంటే.. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇందులో ఖాతా తెరిచి కరోనా అవగాహన వీడియోలు పోస్ట్ చేస్తోంది. మరి ఈ యాప్ ఎందుకింత ఫేమస్ అయిందంటే మానవ మెదడులో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ కారణమని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఎదుటి వ్యక్తిని అనుకరించడం వల్ల కలిగే అనుభూతి ఈ న్యూరాన్స్ వల్ల కలుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఏదైనా ఆసక్తి కలిగించే పనిని అనుకరించాలన్నా కోరిక కూడా ఈ న్యూరాన్ల వల్లనే కలుగుతుందని చెప్పారు. అందుకే టిక్ టాక్‌లో ఒకరి డ్యాన్సులు మరొకరు, ఒకరి నటన ఇంకొకరు అనుకరిస్తూ వారిలో నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటుంటారు. టిక్ టాక్ ఉపయోగిస్తున్నవారందరూ వీడియోలు చేస్తున్నారని కాదు.. మానసిక ప్రశాంతత కోసం, ఆహ్లాదం కోసం వీడియోలు చూసే వారు ఉన్నారు.

ఇతరులు అనుకరించి చేసిన వీడియోలకు విమర్శలు చేయాలన్న అనుభూతి కూడా ఈ న్యూరాన్ల వల్ల కలుగుతుందట. మనుషులు ఈ మానసిక స్థితి వల్లనే టిక్ టాక్‌తో పాటు అన్ని రకాల సోషల్ మీడియా సైట్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేవలం టిక్ టాక్ విషయంలోనే కాకుండా ఈ న్యూరాన్లు యోగ నేర్చుకునేటపుడు, డ్యాన్స్ చేసేటపుడు కూడా మెదడును ప్రభావితం చేస్తాయి. కొంత మంది స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుసుకున్నపుడు వారు సాధారణ షేక్ హ్యాండ్ కాకుండా ఒక ప్రత్యేక డ్యాన్స్ మూమెంట్‌ని వారి స్నేహానికి గుర్తుగా పెట్టుకుంటారు. ఇలా డ్యాన్స్ మూమెంట్ ద్వారా హ్యాండ్ షేక్ చేసుకునే స్నేహితుల ఎక్కువ నమ్మకం, చాలా మంచి బంధం ఉండటానికి కూడా ఈ మిర్రర్ న్యూరాన్లే కారణమని శాస్త్రవేత్తలు వివరించారు.

Tags: Tik Tok, Viral Videos, Mirror Neurons, Dance Moves, Social Media

Advertisement

Next Story

Most Viewed