స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో శాంసంగ్‌ను వెనక్కి నెట్టిన రియల్‌మీ!

by Anukaran |   ( Updated:2021-12-12 11:31:19.0  )
realme
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ ఈ ఏడాది అక్టోబర్‌లో 18 శాతం వాటాతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్‌ను అధిగమించినట్టు కౌంట్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. సమీక్షించిన నెలలో శాంసంగ్ 16 శాతం వాటాను కలిగి ఉండగా, షావోమీ(ఈ సంస్థ పోకో బ్రాండ్ కలిపి) 20 శాతం వాటాను, వీఓ 15 శాతం వాటాను కలిగి ఉంది. ఏడాదికి 4 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని లక్ష్యంగా ఉన్న రియల్‌మీ సంస్థ 2022 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది.

అలాగే, రాబోయే రెండేళ్లలో వినియోగదారులకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా టీవీ, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ పరికరాలు, ట్యాబ్లెట్‌ల విభాగంలో మొదటి ఐదు బ్రాండ్‌లలో ఒకటిగా ఉండాలని భావిస్తున్నామని’ రియల్‌మీ సహ-వ్యవస్థాపకుడు మాధవ్ షేత్ అన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్‌ సమయంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో 52 శాతంతో నంబర్ 1 బ్రాండ్‌గా నిలిచింది. మొత్తం భారత ఆన్‌లైన్ అమ్మకాల్లో 27 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

2020లో మొత్తం 1.8 కోట్ల మొబైల్‌ఫోన్ అమ్మకాలతో పోలిస్తే 2021లో 2.3-2.4 కోట్ల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. దేశీయంగానే తమ మొబైల్‌ఫోన్‌లను 70 శాతం అసెంబుల్ ప్రక్రియ జరుగుతోందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించేందుకు వచ్చే ఏడాది నాటికి 30,000 నుంచి 55,000 ఔట్‌లెట్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed