అసైన్డ్ భూములపై ‘రియల్’ కన్ను!

by Shyam |
అసైన్డ్ భూములపై ‘రియల్’ కన్ను!
X

దిశ వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు ‘రియల్’ మాఫియా అక్కడ గద్దలా వాలిపోతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత పచ్చని పంట పొలాలు, చెరువులు, కుంటలను ఆ మాఫియా వెంచర్లుగా మారుస్తోంది. గత ప్రభుత్వం నిరుపేద దళితులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములనూ వదలడం లేదు. అయితే, ఈ రియల్టర్లను అదపు చేయాల్సిన రెవెన్యూ అధికారులే వారికి సహకారం అందిస్తున్నారనీ, అందుకే వారి అక్రమాలకు అడ్డూ అదపు లేకుండా పోతోందని బాధితులు వాపోతున్నారు. చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహిస్తున్న వ్యక్తులు తమ సంస్థల పేరిట అసైన్డ్, వివాదాస్పద ఇతర భూములు కొనుగోలు చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారని తెలుస్తోంది.

అక్రమార్కులకే అధికారుల వత్తాసు!

1998లో అప్పటి వరంగల్( ప్రస్తుతం జనగామ జిల్లా)లోని రఘునాథపల్లి అశ్వరావుపల్లికి చెందిన 9 మంది నిరుపేద దళితుల కోసం అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 13 ఎకరాల 29 గుంటల భూమిని కొనుగోలు చేసింది. ఒక్కొక్కరికి 1 ఎకరం 21 గుంటల చొప్పున పంపిణీ చేసింది. నాటి నుంచి సదరు దళితులు తాళ్లపెల్లి బక్కమ్మ, తాళ్లపెల్లి అబ్బమ్మ, తాళ్లపెల్లి అంజమ్మ, చేపూరి నాగమ్మ, బొల్లపెల్లి పోచమ్మ, భాగ్యమ్మ, బొలైపల్లి ప్రేమలత, తాళ్లపెల్లి సోమలక్ష్మి, పసుగొండ పుష్ప ఆ భూములు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి వరంగల్-హైదరాబాద్ హైవే‌పై ఉండటంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఎకరం ధర కోటి రూపాయలు పలుకుతోంది. దీంతో కొంతమంది రియల్టర్ల కన్ను ఆ భూముల‌పై పడింది. రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకున్న ఆ అక్రమార్కులు రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు సమాచారం. 2007లో రఘునాథపల్లి‌లో పర్యటించిన అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వారి భూముల పేరిట తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటిస్తూ పత్రాలు అందజేశారు. కానీ, అప్పటి వరకు దళితుల పేరిట ఉన్న భూమి కాస్తా ఆ తర్వాత ఇతరుల పేరిట రికార్డుకెక్కింది. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాధితులు 2016లో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను సైతం కలిశారు. దాంతో కలెక్టర్ కరుణ దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్‌కు లేఖ రాశారు. కానీ, స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తూ దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

కేసు నడుస్తుండగా పట్టా.?

తమ భూములను ఇతరులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలిసి వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో బాధితులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం వారికి భూములు పంపిణీ చేసిన సందర్భంగా అందజేసిన రిజిస్ట్రేషన్ పత్రాలు, కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రుణమాఫీ పత్రాలు, ఇతర ఆధారాలను జతపరుస్తూ కోర్టుకెక్కారు. కబ్జాదారులు భూములను ఆక్రమించే క్రమంలో నిర్మాణాలు చేపట్టగా అడ్డుకున్న ఘటనలు ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. భూ వివాదం కేసు కోర్టులో నడుస్తుండగా రెవెన్యూ అధికారులు ఆక్రమణ దారుల పేరిట రికార్డులు మార్చి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు బాధితులు పేర్కొంటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed