‘రియల్’ దగా.. అమాయకులే వారి పెట్టుబడి

by Sridhar Babu |
‘రియల్’ దగా.. అమాయకులే వారి పెట్టుబడి
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. జిల్లాల విభజన తర్వాత ఈ రంగంపై మందగమనం కనిపించినా తిరిగి కోలుకోవడంతో కొన్ని నెలలుగా భూముల విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలతో పాటు విలీన గ్రామాల్లో కూడా రియల్ జోరు పెరిగింది. దీంతో నగరం చుట్టూ అక్రమ వెంచర్లు వెలిశాయి. నగరానికి నాలుగు వైపులా మొదలైన ఈ వ్యాపారం మూడు వెంచర్లు ఆరు ప్లాట్లుగా విరాజిల్లుతోంది. విలీన గ్రామాల్లోని రైతులను రియల్ బ్రోకర్లు మచ్చిక చేసుకుని వారి భూములతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న పోరంబోకు, బండరాయి, వివాదాస్పద భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. అమాయక ప్రజలను తమ మాయమాటలతో మభ్యపెట్టి ప్లాట్ల పేరిట వారికి అంటగడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములు ప్లాట్లుగా మార్చుతున్న సందర్భంలో అవసరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు.

అనంతరం సుడా, బల్దియాల నుంచి భవన నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లభించక, బ్యాంకుల నుంచి ఎలాంటి రుణాలు మంజూరు కాక కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలా కన్వర్షన్‌తో పాటు ఇతరత్రా వచ్చే ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతోంది. వెంచర్ల నిర్వాహకులు మాత్రం భూమి కొనుగోలు చేసిన ధరకు 200 శాతానికి పైగా అమ్ముకుంటున్నారు.

అప్పనంగా డబ్బులు ఆర్జిస్తూ అనతికాలంలోనే కోటీశ్వరులవుతున్నారు. కొనుగోలు దారులు మాత్రం తమ అవసరం నిమిత్తం తిరిగి విక్రయించేందుకు చేసే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో క్రయ విక్రయదారుల మధ్య వివాదాలకు దారి తీసి, వ్యక్తిగత కక్షలకు అక్రమ వెంచర్లు ఆజ్యం పోస్తున్నాయి. నగరానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూడా వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, తమ బ్రోకర్ల ద్వారా అమాయకులకు కట్టబెడుతున్నారు. రూరల్ మండలం నగునూర్, బొమ్మకల్, కొత్తపల్లి మండల కేంద్రం.. ఇటీవలే బల్దియాలో విలీనమైన అల్గునూర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో వెంచర్ల నిర్మాణం ఊపందుకుంది. నగునూర్ గ్రామంలో ప్రతిమ వైద్య కళాశాల సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి 458, 459, 460, 464 సర్వే నెంబర్లలో దాదాపు 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాల ప్రచారం ప్రారంభించాడు.

డీటీసీపీ అనుమతి లేకున్నా ఉన్నట్టుగా కరపత్రాలు ముద్రించి తన అనుయాయుల ద్వారా పంపిణీ చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 10 ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాటు చేయాలంటే ముందుగా భూమి మార్కెట్ ధరలో 3 శాతం చలానా చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం అన్ని అర్హతలు పరిశీలించి సుడా ధృవీకరిస్తే తిరిగి ఆ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ప్లాట్లకు సంబంధించిన బ్లూ ప్రింట్ సమర్పించాలి. అనంతరం భూమిలో 10 శాతం స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, గుడి, బడి వంటి నిర్మాణాలు సంబంధిత పంచాయతీ చేపడుతుంది.

అయితే, ఇలాంటివేమి లేకుండానే రైతుల పేరుతో ప్లాట్లు విక్రయిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, విక్రయదారులను ప్రశ్నిస్తే చేతులెత్తేస్తున్నారని మండిపడుతున్నారు. బొమ్మకల్ గ్రామ శివారులో కూడా పోరంబోకు భూమి ఆక్రమించిన ఓ చోటా నాయకుడు ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా చోట్ల విస్తరిస్తున్న వెంచర్లలో అధికార నేతల ప్రమేయముందనే బలమైన ఆరోపణలొస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న ఈ తతంగంపై అధికారులు స్పందించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రియల్ దగాపై జిల్లా యంత్రాగం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు దూరమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాన్ లే అవుట్‌తోనే సమస్యలు : వై.సుభాష్ , సీపీవో

సుడా లే అవుట్ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిని రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాలుండవు. ఇంటి నిర్మాణాలకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి అనుమతులు లభించవు. ఎల్ఆర్ఎస్ అనుమతులు రావు. ఫలితంగా ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేక ఆ భూమి నిరుపయోగంగా మారే అవకాశముంటుంది.

Advertisement

Next Story

Most Viewed